What is upakarma? ఉపాకర్మ అంటే ఏమిటి ,

Venkataramana Dharmavarapu:
అసలు ఉపాకర్మ అంటే ఏమిటి ,

" ఉపక్రమణ కర్మ " ( ఆరంభించుట )

ప్రాచీన కాలములో , వేదాధ్యయనము చేయు  బ్రహ్మచారులు గురుకులం లో నివశిస్తూ ఉండేవారు. వేదాధ్యయనము సంవత్సరము పొడగునా ఉన్నా , మధ్య మధ్యలో కొంత వ్యవధి ఉండేది.. ఆ వ్యవధిలో వారు తమ ఇళ్ళకు వెళ్ళిరావడమో , లేక ఆచార్యుని ఇంటనే ఇతరపనులు చూసుకోవడమో చేసేవారు. వేదాధ్యయనమును తాత్కాలికముగా నిలిపివేయడము , తర్వాత మళ్ళీ మొదలుపెట్టడము అన్నవి గొప్ప ఉత్సవాలు. ఈ రెంటినీ మంత్రపూర్వకముగా , సంస్కారపూర్వకముగా , గృహ్యసూత్రానుసారము  ఆచరిస్తారు. వేదాధ్యయనాన్ని తాత్కాలికంగా నిలిపివేయడాన్ని " ఉత్సర్జనము "  అనీ , నిలిపిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టడాన్ని " ఉపాకర్మ " అని అంటారు.  రెంటినీ కలిపి ఉత్సర్జనోపాకర్మ అంటారు.

ఈ ఉపాకర్మను ఆచార్యుడు శిష్యులతో పాటూ ఏదైనా నదీతీరములో ఆచరించుట శ్రేష్ఠమని చెప్పబడినది. కొన్ని సమయాల్లో నదులకు దోషాలుంటాయి.. అప్పుడు ఆ సమయాల్లో నదీస్నానము వంటివి చేయరు. కానీ ఉపాకర్మ నాడు నదులలో ఎట్టి దోషమున్ననూ అది దోషము కాదు అని గార్గ్యోక్తి. విద్యార్థులు ఆనాడే వపనము చేయించుకొనవలెను. వారికి కూడా వపనము నకు చూడవలసిన తిథివార దోషములు ఆనాడు వర్తించవు.

ఉత్సర్జనము

ఉత్సర్జనములో భాగముగా , దర్భలతో చేసిన కూర్చలలో కాండఋషులను ఆవాహన చేసి , షోడశోపచార పూజచేసి , తర్పణము ఇచ్చి , ప్రతిష్టిత అగ్నిలో షట్పాత్ర ప్రయోగపూర్వకముగా నవకాండ ఋషులకు , చతుర్వేదాలకు హోమము చేసి హవ్యమునర్పిస్తారు.

ఉపాకర్మ

 ఉపాకరణము ( ఉపాకర్మ ) అనేది కూడా రెండు రకాలు.

ఒకటి అధ్యాయోపాకరణం , రెండోది కాండోపాకరణం.

ఉపనయనము అయిన తర్వాత , వేదాధ్యయన ప్రారంభాన్ని అధ్యాయోపాకరణము అంటారు.  అధ్యాయోపాకరణానికి ముందర , వేదములోని కాండఋషులకు హోమములు చేసి, ఆ తర్వాతనే అధ్యయనము చేయవలెను. కాండఋషులకు చేయు హోమాలనే కాండోపాకరణం అంటారు.

యజుర్వేదులకు ,  కాండోపాకరణము అంటే , ప్రాజాపత్య , సౌమ్య , ఆగ్నేయ , వైశ్వ దేవ , మొదలుగాగల తొమ్మిది  కాండముల ఋషులకు ( నవకాండ ఋషులు )  హోమము చేయుట. తర్వాత ఆయా కాండములను అధ్యయనము చేయవలెను.   కాని ,  యజుర్వేదములో మంత్రాలు , ( సంహిత , బ్రాహ్మణము , ఆరణ్యకములలోని మంత్రాలు ) ప్రత్యేకముగా ఉండక అన్నీ కలగలసి ఉంటాయి. ఇలా కలగలసి ఉన్న మంత్రాల పాఠమును సారస్వత పాఠము అంటారు. కాండ పాఠానికి అనుగుణముగా , అదే క్రమములో సారస్వత పాఠము ఉండదు. ( అంటే , ఒక కాండ ఋషి కనుగొన్న మంత్రాలు అన్నీ ఆ కాండములోనే ఉండవు. మిగిలినవాటిలో కలగలసి ఉంటాయి )   కాబట్టి , కాండోపాకరణము ఎప్పటికప్పుడు కాక, అధ్యయనోపాకరణము తర్వాత , సర్వ కాండఋషి హోమము ( కాండోపాకరణము )  చేయుట రూఢియై ఉన్నది.

కాబట్టి యజుర్వేద ఉపాకర్మలో భాగముగా , మొదట గణపతి పూజ , పుణ్యాహవాచనము చేసి , తర్వాత ఉత్సర్జనలో వలెనే ,  కాండఋషులను ప్రతిష్టించి, షోడశోపచార పూజ చేసి , తర్పణమునిచ్చి , షట్పాత్ర ప్రయోగము ద్వారా హోమము చేసి , బ్రహ్మముడిని విప్పిన యజ్ఞోపవీతమును హోమములో అర్పిస్తారు. అంతేకాక , నూతన యజ్ఞోపవీతాలకు పూజచేసి , దక్షిణలతో పాటు పెద్దలకు దానము చేసి , ఆశీర్వాదముపొంది , తర్వాత , తాముకూడా " శ్రౌత స్మార్త కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధి " కోసము నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి , జయాది హోమములను , ( ప్రతి ముఖ్యమైన హోమములలోనూ ఈ జయాది హోమములు చేయుట తప్పని సరి ) , తర్వాత , హోమకాలములో సంభవించు అనేక లోపదోషములకు ప్రాయశ్చిత్తముగా ’ ప్రాయశ్చిత్త హోమము ’ చేసి , ప్రత్యేక మంత్రాలతో పూర్ణాహుతి చేసిన ఉపాకర్మ సమృద్ధి అవుతుంది.

అనంతరము , గడచిన సంవత్సరంలో   వేదాధ్యయనములోను , సంధ్యావందనాది అనుష్ఠానములలోను ,మరియు  ఇతర వైదిక కర్మల దోషములు , లోపముల పరిహారము కోసము  నువ్వులు , బియ్యపు పిండి , మరియూ నెయ్యి కలిపిన పురోడాశము ( హవిస్సు ) తో రెండుచేతులతోనూ " విరజా హోమము " ఆయా మంత్రములతో చేయవలెను.

తర్వాత ’ బ్రహ్మ యజ్ఞము ’ చేసి , అగ్ని మరియు ఋషులకు నమస్కారములు చేయవలెను. బ్రహ్మచారులు " ఆయుర్వర్చో యశోబలాభివృధ్యర్థం " అని చెప్పుకొని ప్రాతరగ్ని కార్యము చేయవలెను. ఆచార్యుడిని , దక్షిణ , తాంబూల , నూతన వస్త్రములతో సత్కరించవలెను. నవకాండఋషులను విసర్జించి , పర్జన్య సూక్తముతో నదీనీటిలో విడువవలెను.

మరునాడు , గాయత్రీ హోమమును కానీ , సహస్ర గాయత్రిజపము కానీ చేసి , పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించవలెను.

ఇక , ఉత్సర్జనం ఎప్పుడు చేయాలి , ఉపాకరణం ఎప్పుడు చేయాలి ?

గృహ్య సూత్రాల ప్రకారము ,

యజుర్వేదీయులు  ఉత్సర్జనమును పుష్యమాసపు పౌర్ణమియందు చేయవలెను. ఋగ్వేదులైతే ఈ ఉత్సర్జనమును మాఘ పౌర్ణమి నాడు చేస్తారు.

యజుర్వేదీయులు ఈ ఉపాకర్మను శ్రావణమాసపు పౌర్ణమి యందు , ఋగ్వేదీయులు శ్రావణ మాసములో శ్రవణ నక్షత్రము వచ్చిన దినమందు , సామవేదులు భాద్రపద మాసపు హస్తా నక్షత్రపు దినమందు ఆచరించుట వాడుకలో ఉంది.

అయితే , ఉత్సర్జనమును పుష్యమాసములో ఒకసారి , తర్వాత ఉపాకర్మను శ్రావణములో ఒకసారి చేయుట అనుకూలము లేనివారు , ఉత్సర్జనమును కూడా ఉపాకర్మ నాడే , ఉపాకర్మకన్నా ముందుగా చేయుట ఆచారములో ఉంది. అయితే ఇలా

చేస్తే  ఉత్సర్జనము చేయుటకు కాలాతీతము అగును కాబట్టి , దానికి పరిహారముగా , మొదట పాహిత్రయోదశ హోమమును చతుష్పాత్ర ప్రయోగముతో ఆచరించవలెను.

వేదాధ్యయనమును ద్విజులు అందరూ , వీరు వారు అనుభేదములేక చేయవలెను.  ఈ కాలము , పౌరోహితులు మాత్రమే వేదాధ్యయనము చేయవలెను / చేస్తారు  అన్న ఒక అపోహ చాలామందిలో ఉంది. అది సర్వథా అసత్యము. ప్రతి ఒక్క ద్విజుడూ వేదాధ్యయనము చేసి , క్రమం తప్పకుండా ఈ ఉత్సర్జన ఉపాకర్మలను ఆచరిస్తే , వారి జీవితాలు అద్భుతంగా అభ్యుదయ మార్గంలో పయనించి ధన్యులవుతారు.

ప్రథమోపాకర్మ

నూతనముగా ఉపనయనము అయిన వటువులు , ఉపాకర్మను ప్రథమముగా జరుపుకొనేటప్పుడు మొదట నాందీ పూజ చేయవలెను. బ్రహ్మచారులు యజ్ఞోపవీతానికి ఒక చిన్న కృష్ణ జింక చర్మపు ముక్కను తగిలించుకోవడము ఆనవాయితీ . దీనికి రెండు కారణాలు.

ఒకటి , యజ్ఞాలలోను , బలులలోను  కృష్ణాజినమును కప్పుకొనుట , కృష్ణాజినముపై  కూర్చొనుట విహితమని చెప్పబడినది. అది ధరించిన వటువు , " ఈ దినము నుండీ నా జీవితము ఒక యజ్ఞము లేక త్యాగము వంటిది. నా జీవితాన్ని లోకకల్యాణమునకై అర్పించవలెను " అని భావించవలెను. రెండోది , కృష్ణాజినము వలన , చిత్తము నిర్మలమై , సాత్త్వికమైన ఆలోచనలు కలుగుతాయి.

ఈ కాలము ఇవన్నీ కేవలము సూత్రప్రాయముగా మిగిలిపోతున్నాయి. కొందరు కేవలము యజ్ఞోపవీతము మార్చుకొనుటే దీని పరమార్థముగా భావిస్తున్నారు.
అంతా శివ సంకల్పం

Comments