గురుపౌర్ణమి సందర్భముగా కుసుమాంజలిDr విశాలాక్షి09-July-2017

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యో నమః.

ప్రణతులొనర్తు నెమ్మదిని భావన చేసి సదాది గురున్ సదాశివుని,
జగద్గురు కృష్ణ పరమాత్మను, తద్రూప ఋషి స్వరూపు గురోర్గురున్ కృష్ణ ద్వైపాయను అంఘ్రి కమలంబులకున్ మ్రొక్కెద, సదా భక్తి భజింతు ఆదికవివర్యు వాల్మీకి మహర్షి పాదయుగమ్ము, భక్తి మైమరచి నమస్కరింతు  ఆదిజగద్గురు శంకరాచార్యుని పాదపద్మముల మచ్చిత్త వర్తిత జడత్వ నివారణార్ధమై.

జాడ్యము హరించి సుజ్ఞాన జ్యోతి వెలిగించు జ్ఞాన బోధక గురువులందర దలంచి వినయమున మ్రొక్కులిడుదును శ్రీశుక సూతశౌనకులకు.

కలియుగమ్మున కరుణతో మనల బ్రోవ నవని కరుదెంచి మన ధర్మ రక్షసేయు అన్ని పీఠంబుల నధివసించిన జగద్గురు పరంపర గురువులందర భజింతు.

శ్రీరామకృష్ణ పరమహంస  రమణమహర్ష్యాది గురువులకును, స్వామి వివేకానందునికి, నాకు విద్య గరపిన గురువులకు, దైవమును జేరు ఉపదేశమిచ్చి బ్రోచిన లౌకిక గురుమూర్తుల పాదపద్మముల కంజలి ఘటింతు.

తొలి గురువు తల్లి జగతిన
మలి గురువగు తండ్రి ఇలను మానవతతికిన్
ఎనలేని మేటి గరువులు వేవేలు కలండ్రు వారి జెప్పం వశమే !

పంచభూతమ్ములు రవిచంద్రులాపైన యజమాని గురువులు యనగనొప్పు నవవిధ దైవస్వరూపములనెలమి
గురువు తొమ్మిది మందిలో గొప్పవాడు.

గురుపౌర్ణమి సందర్భముగా గురు పరంపరకు సభక్తి కృతజ్ఞతా పూర్వక వినయ పద కుసుమాంజలి సమర్పణ.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
డా.విశాలాక్షి.

Comments