Is better to call Lady or Woman? Read this Article by Dr Visalakshi

మహిళలు అనటం మేలా ? స్త్రీ అనటం మేలా ?

స్త్రీ అంటే ఎవరు?
స్త్రీ అనే పదానికి వివరణ ఏమిటి ?

స్త్రీ - పర్యాయ పదాలు ఏమిటి?
స్త్రీ ఎలా ఉండాలి ?

అని ప్రశ్నించారు. జగన్మాత అనుగ్రహంతో వీటికి నాకు తోచిన సమాధానాలను ఇవ్వటానికి ప్రయత్నిస్తాను.

🙏🙏🙏🙏🙏
🌹🌹 స్త్రీ - మహిళ 🌹🌹

స్త్రీ పురుషులు అనటం సంప్రదాయం. సృష్టిలో ఆడవారిని తెలిపే పదాలలో మహోత్కృష్టమైన పదం స్త్రీ. ఎందుకంటే -
స్త్రీ అనే పదం - స త ర లకు ఈ కలిపితే ఏర్పడుతుంది. 'ఈ' కి 'మ్' కలిపితే ఏర్పడేది శక్తి బీజం. అమ్మవారి బీజం. సాక్షాత్తుగా భువనేశ్వరీ బీజం. స - సత్వగుణం, త - తమోగుణం, ర - రజోగుణం - ఈ మూడు గుణాలకు  అమ్మవారి బీజం కలిపితే ఏర్పడే పదం స్త్రీ ! "స్త్రీం" అనేదే ఒక మహామంత్రం. మహా శక్తిమంతమైన మంత్రం.

స్త్రీలో ఉన్న 'స' కారం సర్వ సంపదలకు ప్రతీక. అసలైన సంపద బ్రహ్మజ్ఞాన సంపద. భగవత్సంబంధ సంపద. స - సః - సా - పరబ్రహ్మ వాచక శబ్దాలు. సతి - జగన్మాత. 'స' దేనికి కలిసినా అది సంపూర్ణమవుతుంది. స - సహకార శక్తి. స్త్రీతో - శక్తితో కలిస్తేనే పురుషుడు పూర్ణుడవుతాడు. భార్య సహకారం లేనిదే భర్త ఏమీ సాధించలేడు.

'త' కారం తాత్వికతకు సంకేతం. త - తాదాత్మ్యత. లౌకిక అలౌకిక ఆనందానుభూతిని తాదాత్మ్యత అంటాము. త - తత్ - తత్పద వాచ్యము బ్రహ్మము.

 స్త్రీ - లో ఉన్న 'ర'కారం అగ్ని బీజాక్షరం. సర్వ పాపాలను, సర్వ దుఃఖాలను, బాధలను దహించే శక్తి కలది.
ప్రతి అక్షరము దేవతా స్వరూపమే ! ప్రతి అక్షరానికి శక్తి ఉంటుంది, అధిష్ఠాన దైవముంటుంది.

సృష్టి స్థితి లయలకు మూలశక్తి అయిన ఆదిపరాశక్తి ప్రకృతిగా, ప్రకృతిలో స్త్రీమూర్తిగా ప్రకాశిస్తోంది.
కనుకే స్త్రీ సాక్షాత్తుగా శక్తి స్వరూపిణి. స్త్రీ ప్రకృతికి ప్రతీక ! పురుషుడు పరబ్రహ్మకు ప్రతీక ! ప్రకృతి పురుషుల కలయిక వల్లే సృష్టి ఏర్పడింది. శివ శక్తుల సమ్మేళనమే విశ్వము.

స్తృ - విస్తరణే అనే ధాతువు నుంచి స్త్రీ అనే పదం ఏర్పడింది. వంశాన్ని విస్తరింపజేసేది స్త్రీ. అంటే సృష్టిని సృష్టించేది, విస్తరిల్లచేసేది, లయింప చేసేది స్త్రీయే ! స్త్రీ సృష్టిస్థితిలయ కారిణి. ఇది ఎలా అన్నది మనకు నిత్య జీవితంలో నిత్యానుభవంలో విదితమే కదా !

' అసారభూతే సంసారే
సారభూతా నితంబినీ !
ఇతి సంచింత్య వై శంభు
రర్ధాంగే పార్వతీం దధౌ '!! 
ఈ సంసారంలో సారము - ఆనంద కందం స్త్రీయే !

' స్మితేన భావేన చ లజ్జయా భియా
పరాఙ్ముఖైరర్ధ కటాక్ష వీక్షణైః !
వచోభిరీర్ష్యా కలహేన లీలయా
సమస్త భావైః ఖలు బంధనం స్త్రియః ' !!
ఇన్ని రకాల భావాలతో ఆకర్షిస్తూ, ఆనందింపజేస్తుంది స్త్రీ.

స్త్రీ లక్షణాలన్నింటినీ స్త్రీ పద పర్యాయ పదముల క్రింద అమరకోశంలో చెప్పారు.
" స్త్రీయోషిదబలాయోషా
నారీ సీమంతినీ వధూః !
ప్రతీపదర్శినీ వామా వనితా మహిళా తథా !!
విశేషాస్త్వంగనా భీరుః
కామినీ వామలోచనా !
ప్రమదా మానినీ కాంతా
లలనా చ నితంబినీ !!
సుందరీ రమణీ రామా
కోపనా సైవ భామినీ !
వరారోహా మత్తకాశిన్యుత్తమా వర వర్ణినీ !!
కృతాభిషేకా మహిషీ
భోగిన్యోన్యా నృపస్త్రియః !
పత్నీ పాణిగృహీతా చ
ద్వితీయా సహధర్మిణీ !!
భార్యా జాయాథ పుం భూమ్ని
దారాః స్యాత్తు కుటుంబినీ !
పురంధ్రీ సుచరితా తు
సతీ సాధ్వీ పతివ్రతా !!
.......' , ఇంకా పతింవరా, కులస్త్రీ, కులపాలికా, కన్య, కుమారీ, గౌరీ, తరుణి, యువతి, సువాసినీ మొదలైన అనేక పర్యాయ పదాలు అన్వర్ధాలున్నాయి.

మహిళ అనగానే, నేటి మహిళలు అంటే ఆధునిక మహిళలు, మహిళా సంఘాలు, మహిళా ఉద్యమాలు, మహిళలకు సమాన హక్కులు అంటూ మనవారు ఆధునిక కాలంలో ప్రవర్తిస్తున్న తీరు మనసులో మెదులుతుంది.

మన సంస్కృతి వేద సంస్కృతి. మన ఋషులు దర్శించి చెప్పిన అర్ధనారీశ్వర స్వరూపము, త్రిమూర్తులు త్రిశక్తులను దేహంలో ధరించిన తీరు మనకు ఋషుల ఆంతర్యం, మన సంప్రదాయం తెలిసేలా చేస్తున్నాయి. స్త్రీపురుషులిద్దరూ అవినాభావులు, ఇద్దరూ సమానమే అని వేదాలలో ఘోషిస్తూ చెప్పారు.  ఉపనిషత్కాలంలో స్త్రీలకున్న స్థానాన్ని గమనించి పాశ్చాత్యులు ఆశ్చర్యపోతున్నారు.

అమూర్తమగు పరబ్రహ్మ మూర్తమగు ప్రకృతిని పూర్ణపరిచాడు. నిర్గుణ నిరాకార నిరంజన సచ్చిదానంద స్వరూపమైన అమూర్త పరబ్రహ్మ లక్షణాలే మూర్త ప్రకృతిలో ప్రతిఫలిస్తాయి. ప్రకాశిస్తాయి. స్త్రీ ప్రకృతికి ప్రతీక కనుక, పురుషుడు పరమాత్మకు ప్రతీక కనుక, పరమాత్మ లక్షణాలే పురుషునిలో, స్త్రీలో ప్రతిఫలించాలి, ప్రకాశించాలి. అటువంటి స్త్రీ సకల శుభ గుణ శోభితయై వర్ధిల్లాలి.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటున్నారు.
అంతర్జాతీయ - అనేప్పటికే అది మన సంప్రదాయం కాదు, ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఆచరిస్తున్నది అని అర్ధమవుతుంది.
సాధారణంగా పాశ్చాత్య దేశాల సంప్రదాయం - సంవత్సర కాలంలో ఒక్కో నెలలో ఒక్కో రోజును ఒక్కొక్కరికి కేటాయించి, ఆ రోజును వారి పేరున, వారితో ఆనందంగా గడుపుతూ, వారిని తలుచుకుని, వారిని కలుసుకుని ఆనందంగా గడపటం.

కానీ మన దేశ సంప్రదాయం మన సనాతన సంప్రదాయమవాలి.
మన సనాతన సంప్రదాయంలో ప్రతి హైందవుని జీవితము యజ్ఞ స్వరూపము. మన జీవిత కాలం మొత్తం మనం జీవించేది, జీవించ వలసినది వేద ధర్మం ప్రకారం ! ధర్మ శాస్త్రంలో ఋషులు చెప్పిన ప్రకారం ! మనం అనుదినము మన సంప్రదాయం ప్రకారం జీవిస్తాము. అనుక్షణము స్త్రీలను గౌరవిస్తాము.

ఆత్మీయ మిత్రులు గౌరవనీయులు డా.ఆర్వీకుమార్ గారు చెప్పినట్లుగా మనం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు స్త్రీల గురించి విశేషంగా స్మరిద్దాం.
డాక్టర్.ఆర్వీకుమార్ గారు ఇలా చెప్పారు -

" రాముడిని రోజూ పూజిస్తాం, శ్రీరామనవమినాడు విశేషంగా పూజిస్తాం!
శివుడిని రోజూ పూజ చేస్తాం, శివరాత్రినాడు విశేషంగా పూజ చేస్తాం!
గణపతిని రోజూ పూజ చేస్తాం, వినాయక చవితినాడు విశేషంగా పూజ చేస్తాం!
అలాగే స్త్రీలను రోజూ గౌరవిద్దాం!అంతర్జాతీయ మహిళాదినోత్సవం నాడు విశేషంగా గౌరవిద్దాం!
దానికి పేచీ లేదుగా!"

మనకు అనుక్షణం ఈ విశ్వమంతా పరమాత్మ అనీ, ప్రకృతిలోని సర్వాన్ని భగవదనుగ్రహం వల్ల లభించినదనే స్పృహతో, భగవదర్పణ బుధ్ధితో అనుభవించాలనీ మనకు మన పూర్వీకులైన
మహర్షులు నిర్దేశించారు. మనమందరం దాని ప్రకారం జీవించాలి.
మన ఋషులు బోధించిన ప్రకారం మనమందరం జీవించ గలిగితే ప్రతి ఒక్కరమూ భౌతికంగా ఈ లోకంలో ఆనందంతో సంతృప్తితో జీవితమంతా బ్రతికి, పరంలో శుభాన్ని పొందగలుగుతాము.

మనకు మన ఋషులు ఇలా బ్రతకమని చెప్పారు -
సత్యం వద ! సత్యాన్ని మాట్లాడాలి.
ధర్మం చర ! ధర్మాన్ని ఆచరించాలి. స్వాధ్యాయాన్ మా ప్రమదః ! మనకు విధించిన వేదాధ్యయనం చెయ్యాలి. దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం ! దైవ కార్యాలను పితృ కార్యాలను ఆచరించాలి. !
శ్రధ్ధయా దేయం ! శ్రధ్ధతో దానమివ్వాలి.
మాతృదేవో భవ ! తల్లిని దైవముగా ఆరాధించు.
పితృదేవో భవ ! తండ్రిని దైవముగా ఆరాధించు.
ఆచార్య దేవో భవ ! ఆచార్యుని దైవముగా ఆరాధించు.
అతిథి దేవో భవ ! అతిథిని దైవము గా ఆరాధించు.

యత్ర నార్యస్తు పూజ్యంతే రమన్తే తత్ర దేవతాః ! స్త్రీలు గౌరవించబడే చోట దేవతలు ప్రసన్నులౌతారు. అంటే స్త్రీలను గౌరవించండి అని చెప్తున్నారు.

మానవులందరికీ ఉండవలసిన సద్గుణాలను చెప్పారు. విశేషంగా స్త్రీలు ఎలాంటి సద్గుణాలు, సత్ప్రవర్తనను కలిగి ఉండాలో చెప్పారు. ప్రతి సద్గుణము, సత్ప్రవర్తన స్త్రీపురుషులిద్దరికీ సమానమే, అవసరమే ! ఎవరు ఎలా ఉండాలో వారు అలా ఉండాలి.

పురుషులు ఏకపత్నీత్వము కలవారై, జీవితాంతము తల్లితండులను ప్రేమిస్తూ, గౌరవిస్తూ, తానెంత పెద్ద అధికారైనా, సంపాదన పరుడైనా, తన తల్లితండ్రులు బ్రతికి ఉన్నంత కాలము తండ్రినే ఇంటి పెద్దగా, తల్లినే ఇంటి అధికారిణిగా గౌరవిస్తూ, తల్లితండ్రులను తల్లితండ్రులుగా, భార్యను భార్యగా ప్రేమిస్తూ జీవించాలి.

స్త్రీలను - ఆడపిల్లలను బాల్యము నుంచి సహజంగా మన సంప్రదాయానికి అనుగుణమైన  స్వభావం కలిగి ఉండేలా పెద్దలు పెంచాలి - తాము ఉంటున్నది పుట్టినింట్లో ! పెద్దయ్యాక తాను పెళ్ళి చేసుకుని ఏ ఇంటికి వెళుతుందో, అది తన ఇల్లు. అక్కడి వారందరూ తనకు అత్యంత ఆత్మీయులు. తను వారితో ప్రేమతో, ఇష్టంతో గౌరవంతో మసలుకోవాలి. ఆ ఇంటిపేరే తన పేరు. తను ఆ వంశాన్ని వృధ్ధి చేసి రెండు వంశాలకు మంచి పేరు తీసుకుని వచ్చేలా ప్రవర్తించాలి అని ! తన వంశాన్ని నిలబెట్టే, తన కుమారునికి ఆనందాన్నిచ్చే తనను కూతురు కంటే మిన్నగా ప్రేమించే అత్తగారిని ప్రేమించాలి, గౌరవించాలి, ఆవిడకు తోడునీడలా ఉంటూ ఆవిడ చెప్పినట్లు వింటుంటే, తన సద్గుణాలకు సంతసించి, ఇల్లు నడపగల సామర్ధ్యం ఉన్నదని గుర్తించి అత్తగారు నెమ్మది నెమ్మదిగా ఇంటి బాధ్యతను అప్పగిస్తుంది. ఇలా ఏ ఇంట్లో జరుగుతుందో ఆ ఇల్లు నందనవనంలా ఆనంద దాయకమౌతుంది, ఆ ఇంట్లోని వారందరూ ఎప్పటికీ ఆనందంగా మనగలుగుతారు.

అత్తగారింట్లో వారితో కోడలు ప్రేమగా ఉంటే ఇల్లు ఆనందంగా ఉంటుంది. వారితో ఆత్మీయతతో ఉండటం ఆ అమ్మాయి సహజ స్వభావమవాలి.

ఋషులు మనకు మనం ఎలా జీవించాలో చెప్పారు. మనం అలా జీవించాలి. వారు చెప్పింది - మానవులందరూ ఇలా జీవించాలని -

1. ధర్మం, సత్యం, సమత్వము, ప్రేమ, అహింస, అస్తేయము, భక్తి కలిగి, దైవ గుణాలను అలవరచుకుంటూ, ప్రయత్నంతో ఆసురీ గుణాలను వదిలించుకోవటము అభ్యాసం చెయ్యాలి.

2. ధర్మార్ధకామ మోక్షాలను మన జీవిత పరమార్ధాలుగా జీవితము గడపాలి.

3. స్త్రీలు పురుషులు ప్రకృతి పరంగా సహజంగా వారికి వచ్చే గుణ సంపదను వృధ్ధి చేసుకుంటూ, పరస్పరం ప్రేమతో, సర్దుబాటుతో సహకరించుకుంటూ, మా అమ్మ నాన్న పరస్పరం ఎంత ప్రేమగా ఉంటారో ! మనం కూడా అలా ఉండాలి అని పిల్లలు అనుకునేలా ప్రవర్తించాలి.

కానీ ఎన్నో కారణాల వలన మనం మన సంప్రదాయాలను, మన హైందవత్వాన్నీ, మన సహజతను కోల్పోతున్నాము.

సహజంగా స్త్రీలలో శారీరిక మానసిక సౌకుమార్యము, ఆహ్లాదకత్వము, సహనము, వినయము, వివేకము, సమయస్ఫూర్తి, త్యాగగుణం, నిష్కల్మషంగా, నిరపేక్షంగా తన వారిని ప్రేమించగల శక్తీ ఉన్నాయి. ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనగల మనో ధైర్యము, తెగింపు కూడా ఉన్నాయి.

స్త్రీయే తల్లి, అక్క, చెల్లి, భార్య, కూతురు, హితైషిణి. ఇన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ,
గృహంలో గృహిణిగా ఉంటూనే సమాజంలో అన్ని రంగాలలోను సర్వ సమర్థంగా బాధ్యతలను నిర్వర్తిస్తూ, సర్వ మానవ హితం కోసం శ్రమించే స్త్రీ పురుషుని అంటే తన భర్తలో సగమవగలిగినప్పుడే ఆమె సర్వ శక్తులు ధన్యత చెందుతాయి.
భార్య సౌందర్యం కేవలం ఆమె భర్త కోసం మాత్రమే ! మిగిలిన వారందరికీ ఆమె మాతృ స్వరూపిణి అవగలగాలి. తల్లిలో ఉండే మాతృత్వపు గుణాలు, శక్తి స్త్రీలందరిలో ఎప్పుడూ ఉండాలి. అప్పుడే కుటుంబము, సమాజము క్షేమంగా మనగలుగుతారు.

పూర్వకాలంలో - మొన్నమొన్నటి దాకా కూడా పెద్దలు శాస్త్రోక్త ప్రకారము జీవించేవారు. తమ పిల్లలను క్రమశిక్షణతో పెంచేవారు. చాలా మటుకు అందరి బుధ్ధులు సక్రమముగా ఉండేవి. ఒక పిల్లవాడిని, ఒక ఆడపిల్లని ఎవరిని ఎలా పెంచాలో అలా పెంచి సద్గుణములను, సత్ప్రవర్తనను అలవరిచేవారు.

ఒక ఆడపిల్ల ఎలా పెరగాలో, ఎలాంటి గుణసంపద కలిగి ఉండాలో, ఎటువంటి ఆలోచనా ధోరణి ఆమెలో ఉండాలో, ఆమె ఎలా ఉంటే, కుటుంబాలు, సమాజము ఆనందంగా, ప్రశాంతంగా మనగలుగుతారో అలా ఉండేది. ఆమెకు, జన్మతః సంస్కారము వలన, పెరిగే వాతావరణము వలన, పెద్దల సుశిక్షణ వలన సుగుణ సంపద అలవడేది. మానవుల భౌతిక, సామాజిక ప్రశాంతతకు, ఆనందమయ జీవనానికి ఆడపిల్ల స్వభావము, అత్తగారింట్లో ఆమె ప్రవర్తనలే ముఖ్య కారణాలౌతాయి. ఒక ఆడపిల్లలో, ఆడపిల్లలో ఉండాల్సిన - తాను తన అత్తగారింటి మనిషిని అనే భావన, భగవంతుడు తనకు అనుగ్రహించిన, తన తల్లితండ్రులు తనకు భర్తగా నిర్ణయించిన వ్యక్తిని వివాహం చేసుకున్నాక, అతనే తన సర్వస్వము అనే భావన, అత్తింటి మనుష్యులందరూ తనవారు అనే భావన హృదయంలో  సహజంగా కలగాలి. వినయము, సహనము, అణకువ, ఆడతనము, అమ్మతనము, ప్రేమ, త్యాగము, గృహ నిర్వహణా దక్షత ఉండాలి.

ఈ ఆధునిక యుగంలో మన దేశంలోని చాలామటుకు ప్రజలందరూ పాశ్చాత్య వ్యామోహానికి ఆకృష్టులయి మన స్వభావ సిధ్ధమైన గుణాలను, సంప్రదాయాలను అలవలచుకోవటం లేదు. మన యువత మీద ఆ దుష్ప్రభావం విపరీతంగా పడుతోంది. మనుష్యులలో నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. స్వార్ధం మితిమీరుతోంది. ప్రతి ఒక్కరూ ఎవరికి వారే వారు మాట్లాడినదే, వారు చేసినదే సరైనది, అనుకుంటున్నారు. ఏది ధర్మము, ఏది అధర్మమన్నది ఆలోచించటం లేదు. చాలా మంది  ఆడపిల్లలు మితిమీరిన స్వేచ్ఛా జీవితానికి అలవాటు పడి, మన కట్టు, బొట్టు, సంప్రదాయం, పధ్ధతులను తెలుసుకోక, పాటించక, తమకు నచ్చినట్లుగా తాము ప్రవర్తిస్తున్నారు. పెద్దలను ఎదిరిస్తున్నారు. పెద్దలు కూడా వారిని కట్టడి చెయ్యక కొందరు, పెద్దలు చెప్పినా వినక కొందరు, పెద్దలకు అసలు మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తిస్తూ కొందరూ కుటుంబంలోని ఆనందాన్ని, శాంతిని, ప్రేమను పోగొడుతున్నారు.

ముఖ్యంగా ఈ కాలంలో ఆడపిల్లలు పెళ్ళయ్యాక తాను, తన భర్త, తమ పిల్లలు మాత్రమే ఉండాలని కోరుకుంటున్నారు. పోనీ అలా కోరినా ఫరవాలేదు. తల్లితండ్రులు, పిల్లలు ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ, ఒకరి కష్టసుఖాలు మరొకరు చూస్తూ, వేరువేరుగా కాపురమున్నా ఫరవాలేదు. కానీ కొడుకు తల్లితండ్రులతో కలిసి ఉండాలనీ, కోడలికి అత్తమామల పొడ గిట్టక, ఇంట్లో అడుగు పెట్టినప్పట్నుంచి తాను తన ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తూ, పెద్దచిన్నల తేడా పాటించ కుండా, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నందు వలన వారి రక్షణ కోసం వచ్చిన చట్టాలను అలుసుగా తీసుకుని, కుటుంబ సభ్యులను భయపెడుతూ, వారి మనసులను కలతపెడుతూ ప్రవర్తిస్తున్నారు.

ఇటువంటి దుస్థితి పోయి, మన సహజ స్వభావములు, సహజ ధార్మిక ప్రవర్తన, ఆనందమయ జీవనము మళ్ళీ మన సమాజంలో నెలకొనాలంటే, మనందరిలో సరైన జీవన విధానం అలవడాలి. మనము ఎవరము అనే స్పృహ కలగాలి. ధర్మబధ్ధమైన, క్రమబద్ధమైన ఆలోచనలు, జీవన విధానము అలవడాలి. నేడు సమాజంలో ఉన్న విద్యావిధానం కాకుండా, మన జగద్గురువులు తలపెట్టి, నడిపిస్తున్న, మన సంస్కృతిని, సంప్రదాయాలను శైశవం నుంచే నేర్పించే వేదపాఠశాలలలో, సంప్రదాయ పాఠశాలలలో విద్యాబుద్ధులు నేర్పించే పద్ధతి రావాలి. దానికి అనుకూలంగా గృహ వాతావరణం కూడా ఉండాలి. అందరూ మేము హైందవులము అని సగర్వంగా చెప్పుకోగలగాలి, తిలక ధారణ చెయ్యాలి, నిత్య కర్మల నాచరించాలి. మనదైన హైందవత్వం మన ఆలోచనలలో, జీవన విధానంలో కనిపించాలి. మన జీవిత గమ్యం మనం గుర్తించ గలగాలి. ఆ గమ్యాన్ని చేరటానికి ఎటువంటి జీవనం గడపాలో, అలా జీవించటం అలవడాలి. దానికి మన పెద్దల నుంచి మనకు సంక్రమిస్తున్న సరైన జీవన విధానం కలిగి, కులదేవతా, ఇష్టదేవతా ఆరాధన చేస్తూ, దైవ తత్త్వాన్ని తెలుసు కుంటూ, జపిస్తూ, సేవిస్తూనే, లౌకికమైన కర్మలను, ఉద్యోగ ధర్మాలను నిర్వర్తించాలి. ఇలా లౌకిక పారలౌకిక ధర్మాలను అనుసంధానం చేస్తూ జీవిస్తూ పరమార్ధం సాధించాలి. ఇటువంటి జీవితం గడపటానికి ముఖ్యంగా కావలసినది ధర్మపత్ని సహకారం ! స్త్రీ సహకారం లేనిదే పురుషుడు ఏదీ సాధించలేడు. కనుక ఉత్తమ భర్త కోసం భార్య, ఉత్తమ భార్య కోసం భర్త పరమాత్మను ప్రార్ధంచాలి. ఉత్తమ పౌరుల కోసం సామూహికంగా శక్తి స్వరూపిణి అయిన జగన్మాతను ప్రార్ధించాలి, భగవత్ప్రార్ధన చెయ్యాలి. అప్పుడు విశ్వ స్వరూపిణి అయిన జగన్మాత సర్వ మానవాళికీ సద్బుద్ధిని అనుగ్రహించి విశ్వ శ్రేయస్సు కలిగిస్తుంది. శక్తి లేనిదే ఎవ్వరూ ఏదీ చెయ్యలేరు.

శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి .....

సాక్షాత్తుగా శివుడు కూడా శక్తితో కలిస్తేనే పని చెయ్యటానికి సమర్ధుడవుతాడు. లేకపోతే కొంచెం కూడా స్పందించ లేడు. ఆ శక్తి స్త్రీ ! కనుక శక్తి స్వరూపిణి అయిన స్తీని గౌరవించే చోట దేవతలు ఆనందించి ప్రసన్నులై, సకల శుభాలను కలిగిస్తారు.

  🙏ఓం తత్సత్.🙏

Comments