శ్రీ రామయణం బాలకాండం 72 వ సర్గ సీతమ్మ వంశము

 శ్రీ రామయణం బాలకాండం 72 వ సర్గ సీతమ్మ వంశము 

ఓ మహామునీ! సద్వంశుడు (వధువు తండ్రి) కన్యా దాన సమయమున తన వంశ వృత్తాంతమును పూర్తిగా వివరించుట సమంజసము గదా! దయతో వినుడు. మా వంశమునకు మూల పురుషుడు ‘నిమి’ మహారాజు. అతడు తన సత్కార్యములచే ముల్లోకములలోను ప్రసిద్ధి కెక్కినవాడు, మిక్కిలి ధర్మాత్ముడు, పరాక్రమ శాలురలో మేటి.


అతని కుమారుడు ‘మిథి’, అతడే మిథిలా నగర నిర్మాత, మొదటి జనకుడు. ఆయన కుమారుడు ఉదావసుడు. అతని సుతుడు నంది వర్ధనుడు. అతడు ధర్మాత్ముడు. నంది వర్ధనుని సూనుడు సుకేతుడు.


సుకేతుని తనయుడు దేవరతుడు. అతడు పరమ ధార్మికుడు, మహా బలశాలి. ఆయన పుత్రుడు బృహద్రథుడు. ‘రాజర్షి’గా వాసి కెక్కిన వాడు. బృహద్రథుని కుమారుడు ‘మహావీరుడు’. అతడు శూర శిరోమణి, ప్రతాప శాలి. అతని కుమారుడు సుధృతి. అతడు మహా ధైర్యశాలి, సత్య పరాక్రముడు. సుధృతి యొక్క తనూజుడు దృష్టకేతువు. అతడు వివిధ ధర్మముల లోతులను ఎఱిగిన వాడు, పుణ్యాత్ముడు, రాజర్షి. దృష్టకేతువు యొక్క తనయుడు హర్యశ్వుడు. అతడు సుప్రసిద్దుడు.


హర్యశ్వుని సుతుడు మరువు. అతని పుత్రుడు ప్రతింధకుడు. ప్రతింధకుని సూనుడు కీర్తి రథ మహారాజు. అతడు ధర్మజ్ఞుడు. అతని తనూజుడు దేవ మీడుడు. ఆయన కొడుకు విబుధుడు. విబుధుని తనయుడు మహీధ్రకుడు. కీర్తి రాతుడు మహీధ్రకుని సుతుడు. అతడు మహా బలశాలి, రాజర్షి. అతని పుత్రుడు మహారోముడు. ఆయన తనూజుడు ధర్మ మూర్తి యైన స్వర్ణరోముడు, అతడు రాజర్షి, అతని పుత్రుడు హ్రస్వ రోముడు. అతడు మహానుభావుడు.

పరమ ధర్మజ్ఞుడైన హ్రస్వరోముని ఇరువురు కుమారులలో నేను పెద్ద వాడను. నా తమ్ముడు కుశధ్వజుడు, అతడు మహా వీరుడు.

మా తండ్రి యైన హ్రస్వరోమ మహారాజు జ్యేష్ఠుడ నైన నన్ను రాజ్యాభిషిక్తుని గావించెను. మా తమ్ముడైన కుశధ్వజుని పోషణాది భారమును నా పైనుంచి ఆయన వనముల కేగెను. వృద్ధుడైన మాతండ్రి స్వర్గస్థుడు కాగా నేను రాజ్య భారమును ధర్మ బద్ధముగా నిర్వహించు చుంటిని. నా తమ్ముడైన కుశధ్వజుడు నిర్మల హృదయుడు, దేవతుల్యుడు. అతనిని వాత్సల్యముతో చూచు చుంటిని.

Comments