రాముల వారి వంశము
శ్రీ రామయణం బాలకాండం 71 వ సర్గ రాముల వారి వంశము
అవ్యక్తమైన పరబ్రహ్మము నుండి బ్రహ్మ దేవుడు జన్మించెను. అతడు శాశ్వతుడు, నిత్యుడు, నాశ రహితుడు, ఆ బ్రహ్మ దేవుని నుండి మరీచి పుట్టెను. మరీచి సుతుడు కాశ్యపుడు. కాశ్యపుని వలన సూర్యుడు (వివస్వంతుడు) జన్మించెను. సూర్యుని కుమారుడు వైవస్వత మనువు. ఈ మనువే మొదటి ప్రజాపతి. అతడు మహారాజు. మనువు పుత్రుడు ఇక్ష్వాకువు. మొదటి అయోధ్యాధి పతి ఈ ఇక్ష్వాకు ప్రభువే. ‘కుక్షి’ యను వాడు ఇక్ష్వాకు పుత్రుడు. అతడు సర్వ శుభ లక్షణ శోభితుడుగా వాసి గాంచెను. సర్వ సద్గుణ సంపన్నుడైన ‘వికుక్షి’ అను వాడు ‘కుక్షి’ సుతుడు. వికుక్షిసుతుడు బాణుడు. అతడు మిక్కిలి తేజస్వి, ప్రతాప శాలి. మిక్కిలి తేజస్వియు,
పరాక్రమ శాలియు ఐన అనరాన్యుడు బానుని తనూజుడు. అనరణ్యుని ఆత్మజుడు పృథువు. పృథువు యొక్క సుతుడు త్రిశంకువు. త్రిశంకువు యొక్క పుత్రుడు దుందుమారుడు. దుందుమారుని కుమారుడు ‘యువనాశ్వుడు’.
‘మాంధాత’ అను చక్రవర్తి యువనాశ్వుని కుమారుడు. సద్గుణ సంపన్నుడైన ‘సుసంధి’ మాంధాత సుతుడు. ద్రువసంది, ప్రసేనజిత్తు అను ఇరువురును సుసంధి పుత్రులు. ద్రువసంది సుతుడు భరతుడు, అతడు మహా యశస్వి మిక్కిలి పరాక్రమ శాలియైన అసితుడు భరతుని తనూజుడు.
సగరుని కుమారుడు అసమంజుడు. ఆయన సుతుడు అంశు మంతుడు. ఆయన పుత్రుడు దిలీపుడు. భగీరథుడు దిలీపుని కుమారుడు. భగీరథుని తనయుడు కకుత్స్థుడు. అతని తనూజుడు రఘు మహారాజు. రఘు మహారాజు యొక్క సూనుడు ప్రవృద్ధుడు.
అతని కుమారుడు శంఖణుడు. శంఖణుని పుత్రుడు సుదర్శనుడు. ఆయన సుతుడు అగ్నివర్ణుడు. అతని తనూజుడు శీఘ్రగుడు. శీఘ్రగుని సూనుడు మరువు. మరువుయొక్క ఆత్మజుడు ప్రశుశ్రుకుడు. ఆయన పుత్రుడు అంబరీషుడు. నహుష మహారాజు అంబరీషుని తనయుడు. నహుషుని కొడుకు అజుడు, అజ మహారాజు పుత్రుడే దశరథుడు. రామ లక్ష్మణులు అను సోదరు లిరువురును ఈ దశరథ మహారాజు యొక్క తనయులు
Comments
Post a Comment