జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తర్థ మహాస్వామి వారు రచించిన విష్ణు విష్ణు గీతానికి డా! సోమంచి(తంగిరాల) విశాలాక్షి గారు అర్ధ వివరణ Maha vishnu kriti composed by Jagadguru Bharathi Theertha swamiji

🙏🌹

జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ  భారతీ తర్థ మహాస్వామి వారు రచించిన ఈ భక్తి గీతానికి భావము చెప్పమని మిత్రులొకరు అడిగారు. జగద్గురు అనుగ్రహ ప్రాప్తిరస్తు. 🙏🙏🙏

గరుడ గమన తవ చరణకమలమిహ
మనసి లసతు మమ నిత్యం
మనసి లసతు మమ నిత్యం !!
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ !!
1. జలజనయన విధినముచిహరణముఖ
విబుధవినుత-పదపద్మ - 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
2.భుజగశయన భవ మదనజనక మమ
జననమరణ-భయహారీి - 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
3.శంఖచక్రధర దుష్టదైత్యహర
సర్వలోక-శరణ - 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
4.అగణిత గుణగణ అశరణశరణద
విదళిత-సురరిపుజాల- 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
5. భక్తవర్యమిహ భూరికరుణయా
పాహి భారతీ తీర్థం - 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
గరుడ గమన తవ చరణకమలమిహ
మనసి లసతు మమ నిత్యం
మనసి లసతు మమ నిత్యం !!
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ !!
🙏🙏🙏

హే గరుడగమనా !గరుత్మంతుని వాహనముగా కలిగిన హే శ్రీమన్నారాయణా ! నీ చరణకమలములు ఎల్లప్పుడూ నా మనస్సు నందే నిలిచి ఉండుగాక ! ఈ లోకంలో నా హృదయమందే నువ్వు నిలిచి ఉందువు గాక !
ఓ దేవా ! నా తాపమును పోగొట్టుము. దారేషణ, ధనేషణ, పుత్రేషణ అనే తాపత్రయాలను నశింపచేయుము.  ఓ దేవా  ! నా పాపములను పోగొట్టుము.
1. పద్మముల వంటి కన్నులు కలవాడా ! బ్రహ్మ దేవుని చేత, నముచి అనే రాక్షసుని సంహరించిన ఇంద్రుని చేత,  పండితులైనవారి యొక్క ముఖముల చేత స్తోత్రము చేయబడిన పాదపద్మములు కల హే దేవా ! నా తాపములను పోగొట్టుము, నా పాపములను పోగొట్టుము.

2. హే భుజగశయనా ! ఆదిశేషుని మీద పవళించే దేవా ! మన్మథుని తండ్రీ ! ఈ లోకంలో పుట్టటమూ, మరణించటమూ అనే  భయమును తొలగించే దేవా ! నాకు జననమరణ భయమును తొలగించుము.  నా తాపములను పోగొట్టుము, నా పాపములను పోగొట్టుము.

3. శంఖ చక్రములను ధరించిన వాడా ! దుర్మార్గులైన రాక్షసులను సంహరించే దేవా ! ఈ లోకులందరికీ శరణమైన దేవా ! నా తాపములను పోగొట్టుము, నా పాపములను పోగొట్టుము.

4. లెక్కపెట్టలేనన్ని సుగుణముల గుంపు కలవాడా !   అసంఖ్యాకమైన శ్రేష్ఠమైన గుణములు కలవాడా !  శరణు కోరినవారందరికీ శరణునిచ్చేవాడా ! శరణు లేని వారికి శరణైనవాడా ! దేవతల శతృవులైన రాక్షసుల సమూహములను అణగద్రొక్కినటువంటివాడా ! నా తాపమును పోగొట్టుము,  నా పాపములను పోగొట్టుము.

5. హే పరమాత్మా ! నీ భక్తవర్యుడైన భారతీ తీర్థుని  ( జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తర్థ మహాస్వామి వారిని ) గొప్ప దయతో రక్షించుము. నా తాపములను పోగొట్టుము,  నా పాపములను పోగొట్టుము.

హే గరుడగమనా ! నీ చరణకమలములే నా మనస్సు లో ఎల్లప్పుడూ నిలిచి ఉండు గాక ! నా మనసు లో నీవే ఎల్లప్పుడూ ఉండునట్లుగా అనుగ్రహింపుము. 🙏🙏🙏

డా|| సోమంచి(తంగిరాల) విశాలాక్షి
 Visalakshitangirala@gmail.com

Comments

Post a Comment