Sankara Jayanthi by Dr Tangirala(Somanchi) Visalakshi శ్రీ శంకర జయంతి జరపటంలో ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి ?

జయజయ శంకర హరహర శంకర. 🙏🙏🙏🙏🙏

శ్రీ శంకర జయంతి జరపటంలో  ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి  ?

ఎవరి జయంతి అయినా వారు మానవాళి కి చేసిన సేవకు కృతజ్ఞతలు తెలియపరచటం కోసం చేస్తాము.
శ్రీ శంకర జయంతి కూడా అందుకే చెయ్యాలి. అంతే కాకుండా మనందరి యోగక్షేమాల కోసం చెయ్యాలి !

సాక్షాత్తుగా సాంబసదాశివుని మానవ రూపం జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యులు.  మనమందరమూ ఎన్ని జన్మలెత్తినా, ఆయనను ఎంత స్తుతించినా, శ్రీ శంకరుల ఋణం తీర్చుకోలేము. ఆయన సర్వ  మానవాళికీ చేసిన మహోపకారానికి, విశేషం గా మన హైందవులందరి కోసం ఆయన సల్పిన నిర్విరామ కృషి కి మనం హృదయ పూర్వకమైన భక్తి తో ప్రణిపాతం చెయ్యాలి, ఆయన ఋణం తీర్చుకోవడం కోసం కూడా శ్రీ శంకర జయంతి జరుపుకోవాలి.
ఎలా జరుపుకోవాలి అంటే - మన సనాతన హైందవధర్మాన్ని నిలబెట్టి, మన ఉనికి కోసం, మనం మన జీవిత గమ్యం చేరటం కోసం కృషి చేసిన శ్రీ శంకరుల గురించి అందరికీ తెలియ పరచాలి. ఆయన చెప్పిన వైదిక ధర్మ మార్గంలో జీవితం గడపాలి. శ్రీ శంకరుల బోధనల సారాన్ని గ్రహించాలి. ఆయన రచనలను చదివి, విని అర్థం చేసుకోవాలి, ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి. సకల వేదముల ఉపనిషత్తుల సారమైన శంకర అద్వైతం అర్థమయ్యేలా అనుగ్రహించమని, అద్వైత సిధ్ధిని కలిగించమనీ  జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులని ప్రార్ధించటమే మనము ఈ శంకర జయంతి ఉత్సవాలు జరపటము లోని ఆంతర్యము.

శ్రీ శంకర జయంతి కి వారం రోజులు ముందు నుంచి శంకర జయంతి ఉత్సవాలను ప్రారంభించి ప్రతి రోజు జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల గురించి, వారి రచనల గురించి, శ్రీ శంకరుల సిధ్ధాంత సారము గురించి చర్చించుకోవాలి, తెలుసుకోవాలి. శ్రీశంకరాచార్యులు వ్రాసిన ఏవైనా రచనలలోని శ్లోకాలని, భావాలనీ మననం చేసుకోవాలి. వీలయినంత ఎక్కువ మందికి ఈ విషయాలన్నీ తెలిసేలా చెయ్యాలి. శంకర జయంతి రోజున హైందవులమందరమూ కలిసి, జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి పాదుకలను ఊరేగిస్తూ,  సౌందర్య లహరిలోని శ్లోకాలు కానీ, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలుకానీ,  శ్రీ తోటకాచార్యులు చేసిన గురుస్తుతి కానీ గానం చేస్తూ నగర సంకీర్తన చెయ్యాలి. దాని వల్ల ఇంకా చాలా ఎక్కువ మందికి శంకర జయంతి గురించి తెలుస్తుంది. తరువాత ఆ పాదుకలను, జగద్గురువుల చిత్ర పటమును వేదికపైన పెట్టి భక్తి శ్రద్ధలతో పూజించాలి. పూజ్యులైన పెద్దలెవరయినా శ్రీ శంకరుల గురించి మాట్లాడిలి. ఆయన రచనలసారమును గురించి చర్చించాలి. వచ్చిన భక్తులందరికీ ప్రసాద వితరణ చెయ్యాలి.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జయ జయ శంకర హరహర శంకర.
డా.విశాలాక్షి.

Comments