సంక్రాంతి సంబరాలు Dr visalakshi డా.విశాలాక్షి. సొమంచి(తంగిరాల)

సంక్రాంతి  సంబరాలు      
------------------------------

 అది ఒక పల్లెటూరు.
హరిత శోభిత సుందర సీమ
సంక్రాంతి కి రమ్మని పిలువనంప
మనమందరమేగితి మచటి కిప్పుడే !
పొగబండి దిగగానే,  ఎదురొచ్చి తెగమెచ్చి
రెండెడ్ల బండిలో నెక్కించుకొనగ,
ఇటు నటుడు జూచుచు
నబ్బుర పడుచుండ
సాగుచుండెను బళ్లు వరి చేలమధ్య

నా బాల్యపు రోజులు మెదిలె మదిలో
నేలను దుక్కి దున్ని వరి నాట్లిడి,
వరి మళ్ళలోపలన్ కలుపును తీసి
పండిన పంటంత చక్కగ తెగ కోసి,
వరి రాశి గా పోసి, కుప్ప నూర్చి,
ధాన్యరాశులు గృహమ్ముల చేర,
నపార సంతసమ్మొప్పగ,
ధాన్యరాశి కడుపు నేరిమి రోళ్ళ నింపి,
రోకళ్ళతొ చక్కగ పోటు పెట్టి
జవరాండ్రు దంచెదరు, చెరిగి పోసెదరు,
తాల్చెదరింకను నేమిపోసెదర్.
జల్లెడ త్రిప్పుచు తౌడు నూకలన్ వేర్పరచి,
నల్కలనేరి యేరి, తిత్తిరీలను తెగ తీసి,
పరిశుభ్రము చేసి,  బంగరు బియ్యము కుప్ప చేసి,
నింపెదరు సంచుల నిండుగ
బియ్యమియ్యెడన్.

మరి నేడు  -
ఈ పనులన్నియు చేయును యంత్ర రాజులే !!

మా ఎడ్ల బండి పయనము కడు రమ్యము మాకు నిపుడు
పరికించుచు చనుచుంటిమి.

కళ్ళాపు జల్లి యలికిన ఇంటి వాకిళ్ళ యందు
తరుణీమణులెలదిశలన్
ముత్యాల ముగ్గులు వేసిరి,
మనోహరమగు రంగులతో
తీర్చిదిద్దిరధికోత్సుకతోన్.

గోమయమ్ముతోడ గొబ్బెమ్మలను చేసి,
రంగవల్లుల మధ్య వాటి నుంచి,
పసుపు కుంకుమ చల్లి, పూలతో పూజించి,
వాటి చుట్టు రేగిపండ్లు వైచి,
చెరుకు ముక్కల తోడు బంతిపూవులతోడ
నలరారు గొబ్బిదేవుళ్ళ కారతిత్తురు - కావుము చల్లగ మమ్ము దీవించుమనుచు.

కురుచగు నెద్దుదెచ్చి, కడు చక్కగ శిక్షణనిచ్చి , తలనూపుట, కాళ్ళనెత్తి నర్తించుట నేర్పి,
కాళ్ళకు గజ్జెలు కట్టి,
కొమ్ములకు, మెడకును భూషణమ్ముల నమరించి,
మూపుపై శాల్వలు కప్పి,
చిత్రపు రంగు వస్త్రములు మేన నమర్చి,
గంగిరెద్దు ను కడు శ్రధ్ధ చేసి,
డోలు వాయించుచు, బాకా ఊదుచు, వీధుల ద్రిప్పుచుండ,
డూడూ డూడూ బసవన్నా! యన
తల యూచుచు, చిత్రపు చేష్టలం జేయు బసవన్నను గని,
జనులాదరమొప్ప
నూత్న పురాతన వస్త్రజాలముల్
మెండుగ కప్పి,
గంగెద్దుల వానికిత్తురు విత్తమాసక్తి తోడ,
ప్రణుతింతురు బసవని,
నిక్కము ఈశ్వరుడే గద వృషభరాజగున్.!!

అంబ పలుకు జగదంబ పలుకు ననుచును,
చేత డమరుకమూని
జోస్యంబు చెప్ప నరుదెంచె
బుడబుక్కలవాడొకండు.

హరి లొ రంగ హరీ హరిలొ రంగ హరీ యనుచు,
చిందులిడు సాతానిజియ్యరొకడు,
ఇంటింటి ముంగిట నిలచినాడు.

తలపైన నొకరాగి అక్షయపాత్రతో,
 కాలికి ఘల్లుఘల్లను గజ్జెలను
కట్టి,
రెండు చేతులలోన చిరుతలను పట్టుకొని,
శ్రీ హరి కీర్తించు హరిదాసు వచ్చె!!

చూడనీశ్వరు దలపించు రూపమునను,
నుదుట విభూతి రేఖల నలదుకొనిన,
చేత శంఖము పూని, ఓంకార ధ్వని తోడ,
హరహర నాదమ్ము చేయు జంగమ దేవ రొకడు - అదిగొ, కనుము.

ఇంటికి చేరిన అతిథుల నెంతో ఆదరమున, స్వాగతించి, గారవించి,
ప్రత్యేక పిండివంటల,
షడ్రసోపేత భోజనము పెట్ట,
మది తుష్టి చెందితిమి మేమందరమున్.

సంక్రాంతి కి కొలువగావలె బొమ్మల రూపున సర్వ దేవతల ననియెడి
భావనాపటిమ,
భామినులందరు వేడ్కతోడ,
కడు నేర్పరులై అమర్చిరి
బొమ్మల కొల్వులు,
గృహాగతు లచ్చెరు వొందగ సుందరంబుగన్.

కలియుగమందు నీ బొమ్మల కొల్వున కారతిచ్చి,
పసిపిల్లల కింపుగ తీపి పెట్ట
వంశమ్మభివృధ్ధి చెందునని,
బ్రహ్మయె చెప్పె, మహీపతి కెప్పుడొ
కూర్మి తోడుతన్.

భోగిమంటలు, కోళ్ల పందాల్,
ఎనుముపోతుల పోరు హోరులు
చెప్పదరమే, బహువిశేషాల్..

మూడు రోజుల పండగిది
బహు ముచ్చటైనది, ముఖ్యమైనది
పెద్ద పండగ ఆంధ్ర జనులకు
ప్రకృతి మాత - మానవాళి - జంతు తతికి - ఉన్న బంధం
చాటి చెప్పే గొప్ప పండగ.
హైందవోత్కర్ష తెలిపే
సంక్రమణ పండగ - సంక్రాంతి - నవ్య సంక్రాంతి.

             జై హంద్.
---------------------------------------------
               రచన
డా.టి ( ఎస్ ) విశాలాక్షి.

Comments