వచ్చింది వచ్చింది శివరాత్రి Dr visalakshi డా.విశాలాక్షి. సొమంచి(తంగిరాల)

వచ్చింది వచ్చింది శివరాత్రి
మనకు శుభములు ఇచ్చేటి శివరాత్రి
మనకు ముక్తిని ఇచ్చేటి శుభరాత్రి !!

గంగతో, గౌరితో కొలువైన హరుడు
హరియించు తాపముల కృపతోడనెపుడు
గజముఖ, షణ్ముఖ జనకుడే అతడు
జగములను పాలించు పరమేశుడతడు !! వచ్చింది !!

ఆశుతోషుడు శివుడు
అడగడేమియు మనను
అరచేతి నీటితో అభిషేకమదె చాలు
ఒక్క దళమును వేయ
అఖిల సిరులను కురియు
!! వచ్చింది !!

పద్మాక్షు పద్మభవు ప్రార్థనలు మన్నించి
ఆది అంతము లేని నిజ తత్వమును చూప
లింగ రూపమ్మున ఉద్భవించెను శివుడు
సగుణ నిర్గుణ బ్రహ్మతత్వమే తాను  !! వచ్చింది !!

శివుడు శక్తి ని దలచు
శక్తి శివుడిని కొలుచు
ఇరువురికి భేదమ్ము ఇసుమంతయును లేదు !! వచ్చింది !!

ఎవరైన ఎపుడైన ఒక్కసారైనా
హరహరా శివశివా అనిన నదియే చాలు
హరియించు పాపముల
కలిగించు శుభములను !! వచ్చింది !!

శరణంటిమో చంద్రశేఖరా! అని పిలువ
వేవేగమే వచ్చి రక్షించుచుండు
తిన్నడిని బ్రోచేను, మృకండు సూనుని బ్రోచె
శ్రీ, కాళ, హస్తులను కృప తోడు కరుణించె !! వచ్చింది !!

ఎందరో ఎందరో మహితాత్ములిలలోన
శర్వుడిని శరణొంది భవ సాగరము దాటి
తరియించి ఈశులోనైక్య మయ్యారు
ఆ భాగ్యమును నాకు భవుడెప్పుడిచ్చునో !! వచ్చింది !!

డా.విశాలాక్షి

Comments

Popular Posts