ముక్తిప్రదమైన మంత్రసాధన

ముక్తిప్రదమైన మంత్రసాధన

ఏ మతంలో లేని అత్యంత శక్తివంతమైన మంత్రసాధన మన హిందూ ధర్మంలో ఉంది. మంత్రాలు కేవలం పదాల నిర్మితాలే కదా అనే వితండవాదులకు శబ్దం యొక్క శక్తిని వివరించడమే మనం చేయాల్సిన పని. ఆ తర్వాత మంత్రం యొక్క శక్తి ఏమిటి అనేది వారికి అర్ధమవుతుంది.

మనం మానవులం, పరమేశ్వరానుగ్రహంతో, పంచభూతాత్మకమైన దేహంతో పాటు, అధ్బుతమైన మేథా సంపత్తిని కూడా పొందాం. ఆకలి, దప్పిక అనే పాశాలతో బంధించబడి వున్న ప్రతిజీవి పశువే. కానీ, పశువులకు లేని వాక్కు, ఆలోచనాశక్తి ఉన్న మనం మనుషులం. మానవ జన్మ ఎత్తినందుకు కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ, చక్కటి జీవితాన్నిచ్చిన సచ్చిదానందునికి కృతజ్ఞులమై, చివరికి ఆయన సన్నిధికే చేరటానికి సాధన చెయ్యాలి. అది మన ధర్మం.

మానసిక పరిణితి సాధించటానికి ఉపయోగపడే మార్గం సాధనామార్గం. ఈమార్గంలో సోపానాలు నాలుగు.

  1. శోధన – చిత్తం యొక్క స్థితిని గమనించి, గ్రహించి అడుపుచేయటం.
  2. శుద్ధి – చంచలమైన చిత్తాన్ని నిగ్రహించిన తర్వాత, అసందర్భపు ఆలోచనలను బయటకు నెట్టి పరిశుద్ధంగా ఉంచుకోవాలి.
  3. ఉద్దారం – నిష్కలమైన చిత్తాన్ని ఉన్నతమైన ఆలోచనలతో, పరంధాముని మీది భక్తితో నింపాలి.
  4. చైతన్యం – భక్తితో అంకురించిన ప్రజ్ఞతో, చిత్తాన్ని లయం చేసి స్థిరత్వాన్నివ్వాలి.

ఈ నాలుగు సోపానాలు దాటిన తర్వాత మనం ఎక్కవలసిన మెట్టు మంత్ర మననం. ఇది అత్యుత్తమమైన సాధనామార్గం.

మనలోని కుండవినీ శక్తి సర్వగతమైన శబ్దబ్రహ్మ. ఆ శక్తి ఉత్తేజితమై, అందులో నుండి ధ్వని, ధ్వని నుండి నాదం, నాదం నుండి నిరోధకం, దానిలో నుండి అర్థేందువు, తర్వాత బిందువు, బిందువు నుండి ‘పరాశబ్దము’ జనించిందని “శారదాతిలకం” అనే గ్రంథంలో విశ్లేషించబడింది. సృష్టి అంతా అంతర్గతమై, శబ్దం అతి సుక్ష్మావస్థనుండి, స్తూలత్వానికి రూపాంతరం చెంది, ‘పరాశబ్దం’ బహిర్గతమైంది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియా శక్తిరూపిణి, త్రిగుణాత్మకం అయిన కుండలనీ శక్తి నుండి పరాశబ్దం, తరువాత పశ్యంతి, మధ్యమా, వైఘరీ శబ్దాలు అక్షరమాలగా రూపొందాయి. పరాశబ్దం మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలలో అధిష్టించి ఉంటే, పశ్యంతి స్వాదిష్టాన చక్రంలో, మధ్యమా శబ్దం అనాహతచక్రంలో ఉపవిష్టమై ఉంటాయి. వైఖరి కంఠం వద్ద విశుద్ధ చక్రంలో నిలిచి ఉంటుంది. ఈ నాలుగు శబ్దాలలో నాలుగవదైన వైఖరీ శబ్దం మనకు వినపడుతుంది. మిగిలిన మూడు శబ్దాలు అవ్యక్తాలు. అంటే మనం బయటకు పలికే మాటలు వైఖరీ శబ్దాలు. ఆకారం నుండి క్ష కారం వరకు ఏర్పడిన శబ్దాలు వైఖరీ శబ్దాలు.

యోగశాస్త్రంలో వివరించబడినట్లు ఒకొక్క చక్రానికి కొన్ని కొన్ని అక్షరాలు నిర్దేశించబడ్డాయి.

  1. మూలాధారచక్రం – 4 దళాలు, వం, శం, షం, సం పృథ్వితత్వం, బీజాక్షరం ‘లం’ ఆధారం.
  2. స్వాధిష్ఠాన చక్రం – 6 దళాలు, బం, భం, మం, యం, రం, లం – జలతత్వం, బీజాక్షరం ‘వం’ ఆధారం
  3. మణిపూరక చక్రం – 10 దళాలు, డం, ఢం, ణం, తం, ధం, దం, నం, పం, ఫం, అగ్నితత్వం, బీజాక్షరం ‘రం’ ఆధారం.
  4. అనాహత చక్రం – 12 దళాలు, కం, ఖం, గం, ఘం, జం, చం, ఛం,ఝుం, టం, ఠం. వాయుతత్వం, బీజాక్షరం ‘యం’ ఆధారం.
  5. విశుద్ధచక్రం – 16 దళాలు – అం, ఆం, ఇం, ఈం, ఉం, ఊం, ఋం, ౠం,ఏం, ఐం, ఓం, ఔం, అం, ఆః ఆకాశతత్వం, బీజాక్షరం ‘హం’ ఆధారం.
  6. ఆజ్ఞాచక్రం – 2 దళాలు, హం, క్షం – ‘ఓం’ కారం ఆధారం.

అక్షర సముదాయమంతా ప్రణవమైన ఓంకారంతర్గతమే. అంటే అ, ఉ, మ అక్షర రూపంలో అంతర్గతం.

ఆకారం – పరాశబ్దం
ఉకారం – మధ్యమ శబ్దం
మకారం – వైఖరీ శబ్దం

మూడు శబ్దాలను ఇలా అన్వయించి, అన్ని వర్ణాలకు ఆధారం ‘ఓం’ అని చెప్పబడింది. ఓంకారమే శబ్దబ్రహ్మమై, అన్నీ మంత్రాలకు ఆది అక్షరమై, మంత్రానికి ప్రాణ సమానమైనది. ప్రణవాక్షరంతో ప్రారంభించబడిన మంత్రాలు, యజ్ఞయాగాదులు, పూజలు, ఉపాసనలు, ఏ కార్యాలైనా పరమ పవిత్రాలు. వేదాలకు కూడా మూలం ప్రణవమే అని చెబుతారు. అందుకే పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవం సర్వాధిష్టాన మంత్రంగా పరిగణింపబడింది.

అ కారాది క్ష కారాంత అక్షర సముదాయం ప్రత్యేకమైన విశేషణాన్ని కలిగి వున్నాయి. ఒకొక్క అక్షరం పంచ భూతతత్వాత్మకంగా ఉండి, ఆయా భూతముల నుండి శక్తిని పొందుతాయి.

  1. వాయుతత్వం – 11 అక్షరాలు – క, ఖ, గ, ఘ, జ, అ, ఆ, ఋ, హ, శ, య
  2. అగ్నితత్వం – 10 అక్షరాలు – చ, ఛ, జ, ఝ, ఇ, ఈ, ౠ, క్ష, ర
  3. పృధ్వీతత్వం  – 11 అక్షరాలు – ట, ఠ, డ, ఢ, ణ, ఉ, ఊ, ష, వ, ల
  4. జలతత్వం – 9 అక్షరాలు – త, థ, ద, ధ, న, వ , ఐ, స
  5. ఆకాశతత్వం – 9 అక్షరాలు – ప, ఫ, బ, భ, మ, ఓ, ఔ, అం, అః

పంచ భూతాల నుండి శక్తిని పొందిన అక్షరాలు శాంతం, రౌద్రం, నెమ్మది మొదలైన లక్షణాల కలిగి, సాధకునికి ఆ గుణాలనే కలుగచేస్తాయి.

మననం చేసేవారిని రక్షించునది మంత్రం. శబ్ద పూరితమైన భావరూపమే మంత్రం.

మంత్రాలు సౌమ్యాలు, ఊష్మాలు, వ్యాపకాలని మూడు రకాలు. అక్షరాలను నాడీ సంబంధాలుగా అన్వయిస్తే, ఇడానాడీ ద్వారంవద్ద ఆ నుంచి అః వరకు, పింగళ నాడీ ద్వారం వద్ద క నుండి మ వరకు, సుషుమ్ననాడీ ఈ మూడు నాడులకు చంద్రుడు, సూర్యుడు, అగ్ని అధిష్టాన దేవతలు. చంద్రుని శక్తిగతమైన అక్షరాలు సౌమ్యాలు, సూర్యుని శక్తిగతమైన అక్షరాలలో నిర్మితమైన మంత్రములు ఊష్మాలు. అగ్నికి సంబంధించిన అక్షర నిర్మితమైన మంత్రాలు వ్యాపకాలు.

అక్షరాల సంఖ్యను బట్టి కూడా మంత్రాలు 5 రకాలు.

1 అక్షరం – పిండం
2 అక్షరాలు – కర్తరి
3-9 అక్షరాలు – బీజం
10-20 అక్షరాలు – మంత్రం
20 పైన – మాలా

అంతేకాదు, స్త్రీదేవతాపరలైన మంత్రాలను విద్యాలని, పురుషదైవ పరాలైన మంత్రాలను మంత్రాలని అంటారు. ఒక పదానికి, అర్ధానికి ఏ సంబంధం ఉందో, ఒక మంత్రానికి, అధిష్టాన దేవతకు అంటే సంబంధం ఉంది. అంటే మాటకు అర్థం తెలీకపోతే ఎంత వ్యర్థమో, మంత్రానికి అవగాహన లేకపోతే అంతే వ్యర్థం. మంత్రాన్ని, అధిష్టాన దేవతను సంపూర్ణంగా అవగాహన చేసుకొని, నమ్మికతో, శ్రద్ధగా మననం చేస్తే సత్వరం సఫలీకృతుడౌతాడు. అట్లాకాకుండా, ఎన్ని లక్షలసార్ల మంత్ర జపం చేసినా వ్యర్థం.

ఉపాసనగా మంత్రాన్ని జపించాలను కుంటే, కొన్ని మంత్రాంగాలను పాటించటం ముఖ్యం. ముందుగా మంత్రానికి మూలమైన ఋషికి నమస్కరించాలి. మంత్ర నిర్మాణానికి ఉపయుక్తమైన ఛందస్సు తెలుసుకోవాలి. మంత్రాధిదేవత రూపాన్ని తలచుకోవాలి. మంత్రానికి సారభూతమైన శబ్ద స్పందన వలన కలిగే శక్తిని గ్రహించి నిలుపుకోవాలి. మంత్రోపాసన చేసే సమయం కీలకం. ఉపాసకునికి అధిక శక్తి నిస్తుంది. ఆధ్యాత్మికత్వానికి ఆదిమూలాలైన వేదాలు అసంఖ్యాకమైన మంత్రాలను, మంత్రాలకు అధిష్టాతలైన దైవరూప, నామాలను ప్రసాదించాయి. ప్రణవాక్షరమైన ‘ఓం’ కారమో, గాయత్రీమంత్రమో, ఓం నమో శివగురు, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ నారసింహాయ, ఓం గం గణాధిపతయే నమః ఏ మంత్రమైనా కానివ్వండి, మన మనసుకు నచ్చిన, గురి కుదిరిన మంత్రాన్ని నిష్ఠగా మననం చేస్తే ఒడిదుడుగులు లేకుండా, సంసార సాగరాన్ని తేలికగా దాటి, తరించగలం.

ఒక ముఖ్యవిషయం. ఈ మంత్రమనేది ఏ దేశంలో కానీ, ఏ భాషలో కానీ కనపడదు. ఒక్క మన భారత దేశంలో, సంస్కృత భాషలో తప్ప. సంస్కరించబడిన భాష సంస్కృత భాషని దేవభాషఅంటారు. అందుకే ఈదేశంలో జన్మించటం మనందరికీ గర్వకారణం కదూ! సర్వమానవ సౌభ్రాతృత్వమే ధర్మంగా కలిగిన, హిందూత్వం మనదైనందుకు నిర్మలమైన  మనస్సుతో, చిత్తశుద్ధితో విశ్వశ్రేయస్సుకు, శాంతికి ఆ పరమాత్ముని పవిత్ర నామాన్ని మననం చేద్దాం.


Soruce: https://sampradayam.wordpress.com/tag/%E0%B0%AE%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82/

Comments