మృత్యుంజయ మహామంత్రం డా.విశాలాక్షి mr̥tyuṁjaya mahāmaṁtraṁ

త్ర్యంబకం  యజామహే సుగంధిం పుష్టివర్ధనం !
ఉర్వారుకమివ బంధనా న్మృత్యోర్ముక్షీయ మామృతాత్ !!

ఇది అపమృత్యువును  తొలగించే,  అమృతత్వాన్ని  ప్రసాదించే మృత్యుంజయ  మహామంత్రం.
త్ర్యంబకం యజామహే అంటే  త్రీణి  అంబకాని  యస్య  సః త్ర్యంబకః - మూడు కన్నులు కలవాడు. అంటే సోమ సూర్యాగ్ని  లోచనుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని కన్నులుగా కలవాడు. భూలోకం, స్వర్గం, పాతాళమనే మూడు లోకాలను, భూత భవిష్యత్, వర్తమానాలనే  మూడు కాలాలను, జాగ్రత్స్వప్న సుషుప్తులనబడే మూడు అవస్థలను ఏకకాలంలో దర్శించగలవాడు త్ర్యంబకుడు. అటువంటి త్ర్యంబకుని - ఈశ్వరుని, శివుడిని యజామహే! అంటే మేము ప్రార్ధించుచున్నాము. ఎటువంటి త్ర్యంబకుని ప్రార్ధిస్తున్నాము అంటే, సుగంధిం = దివ్య శరీరం, దివ్య గంధం కలవాడు, సహజమైన మంచి సువాసన కలిగినటువంటివాడు, మన జన్మాంతర సంచిత కర్మల వాసనలను తొలగించువాడు, పుష్టివర్ధనం = పుష్టిని పెంచునటువంటివాడు, పరిపుష్టిని కలిగించునటువంటివాడు.  జగన్మాత కేశపాశాలు సహజ సుగంధం కలిగి ఉంటాయని నత్కీరుని కథలో బ్రాహ్మణునికి ఈశ్వరుడు వ్రాసి ఇచ్చిన పద్యం వల్ల తెలిస్తోంది కదా ! దేవతలు తేజోమయమైన దివ్య శరీరధారులు. ఈశ్వరుని శరీరం నుంచి సహజమైన సుగంధము వస్తూ ఉంటుంది కనుక సుగంధిం త్ర్యంబకం యజామహే అన్నారు. ఇంకా ఆయన తనను కొలిచేవారికి పరిపుష్టిని కలిగిస్తాడు. శరీరము, మనస్సు పరిపుష్టిగా, ఆరోగ్యవంతంగా  ఉండాలి. అటువంటి పుష్టి నిచ్చే, సుగంధభరితుడైన త్ర్యంబకుని, మిగలముగ్గిన దోసపండు ఎంత సులభంగా ముచ్చిక నుంచి విడివడుతుందో, అంత సులభంగా, అనాయాసంగా మృత్యువు నుంచి వేరు చెయ్యమనీ, అమృతత్వము నుంచి మటుకు వేరు చేయవద్దనీ, అమృతత్వాన్ని కలిగించమనీ ప్రార్ధిస్తున్నాము అని ఈ మంత్రానికీ అర్ధము. ఒక్క దోసపండు తప్ప మిగిలిన కాయలు కానీ పళ్ళు కానీ, మిగలముగ్గినా, దోసపండంత సులభంగా దాని తొడిమ - ముచ్చిక నుంచి విడిపడవు. కనుక మిగలముగ్గిన దోసపండు తొడిమ నుంచి విడిపడినంత సుళువుగా మనలోని జీవుడు - మన ప్రాణం అంత్య సమయంలో ఏ బాధ లేకుండా అంత సులభంగా దేహాన్ని వదిలేసి, పరమాత్మ లో ఐక్యమవాలి.
సుగంధభరితుడైన, పుష్టిని వర్ధిల్లజేసే త్ర్యంబకుని పూజించుచున్నాము, ప్రార్ధించుచున్నాము.
బాగా పండిన దోసపండు దాని తొడిమ నుంచి ఊడి పడేంత సులభంగా నా బంధనముల నుంచి విడిపించుము, అమృతత్వము నుంచి వేరు అవనీకుము.

డా.విశాలాక్షి

Comments