శ్రీ రుద్రుడు ఎవరు ? శివుడెవరు ? డా.విశాలాక్షి. Who is Shiva? Who is Rudhra


జయజయ శంకరహర హర శంకర. ఓం నమశ్శివాయై చ నమశ్శివాయ.


 శ్రీ రుద్రుడు ఎవరు ? శివుడెవరు ?

నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే
నమస్తే నమస్తే చిదానంద మూర్తే
నమస్తే నమస్తే తపోయోగ గమ్య
నమస్తే నమస్తే శ్రుతి జ్ఞాన గమ్య !!

త్వత్తో జగద్భవతి దేవ భవ స్మరారే
త్వయ్యేవ తిష్ఠతి జగన్మృడ విశ్వనాథ
త్వయ్యేవ గచ్ఛతి లయం జగదేతదీశ
లిఙ్గాత్మకం హర చరాచర విశ్వరూపిన్ !!

సాంబ సదాశివుడే శ్రీ రుద్రుడు. శ్రీరుద్రుడు తేజోరూపుడగు మహాదేవుడు. ఆయనకు శంకరుడు, శివుడు, మృడుడు, భవుడు, చంద్రశేఖరుడు, స్థాణువు, పశుపతి, త్ర్యంబకుడు మొదలగు అనంత సార్ధక నామములున్నాయి. రుద్రుడు కరుణాసాగరుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వేశ్వరుడు. మహేశ్వరుని మహిమ వేదశాస్త్రపురాణాదులందు విపులంగా మనోహరంగా వర్ణించబడింది. శివుని తత్త్వం గురించి, మహిమల గురించి లిఞ్గ పురాణంలో, శివపురాణంలో విపులంగా వివరించబడింది.
అటువంటి రుద్రుని స్తోత్రము వేదములో ఉన్న రుద్రాధ్యాయములో ఉంది.
కృష్ణ యజుర్వేద తైత్తిరీయ సంహిత యందు చతుర్ధ కాండములో పంచమ సప్తమ ప్రపాఠకాలను ' నమకము, చమకము ' అంటారు.
నమకములో విశ్వములోని సర్వమూ రుద్రుడే అని చెప్తూ వాటికి నమస్కరించటం చెప్పబడింది. చమకములో అవన్నీ నాకు కావాలి. హే రుద్రా ! వాటన్నింటినీ నాకు అనుగ్రహించు అని ప్రార్ధించటం ఉన్నది.

రుద్ర శబ్దానికి అనేకమైన అర్ధాలున్నాయి.
1. రుతం సంసార దుఃఖం ద్రావయతీతి రుద్రః.
రుద్రుడనగా సంసార దుఃఖమును నాశనము చేయువాడు.

2. రోదయతి సర్వమంతకాల ఇతి రుద్రః.
రుద్రుడనగా ప్రళయకాలమున అందరినీ దుఃఖింపజేయువాడు.

3. రుతౌ నాదాంతే ద్రవతి - ద్రావయతీతి రుద్రః.
నాదము యొక్క చివర ద్రవింపజేయువాడు రుద్రుడు.

4. రుత్యా వేద రూపయా ధర్మాదీనవలోకయతి ప్రాపయతీతి వా రుద్రః.
వేద రూపములో ధర్మమును పొందింప జేయువాడు రుద్రుడు.

5. రుత్యా వాగ్రూపయా, వాక్యం ప్రాపయతీతి రుద్రః.
వాగ్రూపముచే అర్ధ ప్రతీతిని పొందించు వాడు రుద్రుడు.

6. రుత్యా ప్రణవ రూపయా స్వాత్మానం ప్రాపయతీతి రుద్రః.
ప్రణవ రూపమున తనను పొందింపజేయువాడు రుద్రుడు.

7. రుద్రో రౌతీతి సత్యే రోరూపమాణో ద్రవతి - ప్రవిశతి మర్త్యానితి రుద్రః.
సత్యరూపమున మనుష్యులను ప్రవేశించు వాడు రుద్రుడు.

8. రుతిం శబ్దం వేదాత్మానం బ్రహ్మణే దదాతి కల్పాదావితి రుద్రః.
కల్పాది యందు బ్రహ్మకు వేదముల నిచ్చినవాడు రుద్రుడు.
ఇలా అనేక రకాలుగా రుద్ర శబ్దానికి అర్ధాలను వివరించారు.

' రుద్ర ' శబ్దానికి నిర్వచనము, ఎంతమంది రుద్రులున్నారు ? వారెవరు ? అన్న దానిని బృహదారణ్యకోపనిషత్తులోని మంత్రంలో ఇలా వివరించారు.

మం.శ్లో. కతమే రుద్రా ఇతి
దశే మే పురుషే ప్రాణా ఆత్మైకాదశస్తే యదాస్మాచ్ఛరీరాన్మర్త్యాదుత్క్రామన్త్యథ రోదయన్తి తద్యద్రోదయన్తి తస్మాద్రుద్రా ఇతి !!

ఏకాదశ రుద్రులనగా నెవరు ?
పురుషుని యందుండు ప్రాణములు, మనస్సు, జీవాత్మ - ఇవన్నియు కలిసి ఒకటి, మరియు పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు - మొత్తము ఈ పదకొండు మంది రుద్రులు. దశేన్ద్రియాలు, పదకొండవది ఆత్మయే ! వీరే రుద్రులు. ' ఇది ఈ మర్త్య శరీరమును విడిచి వెళ్ళింది ' అని చెప్పటము మానవుని దుఃఖించునట్లు చేస్తుంది. ఇలా ఏడిపించేవి అయినందు వలననే, ' రోదయంతి ' ఇతి రుద్రులని వీటికి సార్ధక నామములు.

ఏకాదశ రుద్రులున్నారు. వారి పేర్లు ఇలా చెప్పబడ్డాయి -
1. రుద్రుడు.
2. త్ర్యంబకుడు.
3. మహేశ్వరుడు.
4. అహిర్బుధ్న్యుడు.
5. హరుడు.
6. ఏకపాదుడు.
7. అజుడు.
8. పినాకి ( త్రిభువనుడు అని కొన్ని చోట్ల ఇవ్వబడింది.)
9. శంభుడు.
10. అపరాజితుడు
11. ఈశానుడు.

రుద్రాధ్యాయమును శతరుద్రీయము అంటారు. శత రుద్రీయమని ఎందుకంటారో తెలుసుకుందాము.

1. శతం రుద్రో దేవతా అస్య ఇతి శతరుద్రీయం.
దీనికి వందమంది - అంటే అనంత రుద్రులు దేవత లగుట చేత శతరుద్రీయ మనబడుతోంది.

2. ఏక శతం యజుశ్శాఖాస్తాసు రుద్రోపనిషదామ్నాయతి.
నూరు యజుర్వేద శాఖలున్నాయి. వానిలో రుద్రోపనిషత్తు పఠింప బడుచున్నది. కనుక అది శత రుద్రీయ మనబడుచున్నది.

3. శత మనంతాని రుద్ర నామధేయాని యస్మిన్తత్ శతరుద్రీయం.
ఇందు శతము అనగా అనంతమైన రుద్ర నామధేయ ప్రశంస కలదు. కనుక నిది శతరుద్రీయము.

4. శతే శాఖాసు పఠ్యతే రుద్రీయం శతరుద్రీయం.
యజుర్వేద శత శాఖలందు పఠింప బడుచుండుట చేత శతరుద్రీయ మనబడుచున్నది.

5. సహస్రాణి సహస్రశో యే రుద్రా అధిభూమ్యామ్.
యే చేమాగుం రుద్రా అభితో దిక్షు శ్రితాః సహస్రశః.
వేలాది రుద్రులు భూమియందు అన్ని దిక్కులనూ ఆశ్రయించు కొని ఉన్నారు. అట్టి శతరుద్రుల ప్రశంస కలది రుద్రీయము.
కనుక రుద్రాధ్యాయము శతరుద్రీయము అనబడుచున్నది.

1. రుద్రాధ్యాయము యజుస్సారమగుటచేత యజుర్వేదము  ఉత్తమత్వము పొందినది.

2. శ్రుతి స్మృతి పురాణేతిహాస ప్రసిద్ధము రుద్రోపనిషత్తు. కనుక సర్వోత్తమము రుద్రాధ్యాయము.

3. ఉపనిషత్తులే మోక్షసాధనములని నిశ్చయింపబడినవి. వానిలో శతరుద్రీయము సర్వోత్తమమని నిశ్చయింపబడినది.

4. సర్వోపనిషదాం సారో రుద్రాధ్యాయః.
అన్ని ఉపనిషత్తుల సారమే రుద్రాధ్యాయము.

5. పంచమవేదమగు శ్రీమహాభారతమున ద్రోణ అనుశాసనిక పర్వములందు శతరుద్రీయ ఉత్తమత్వము ప్రశంసింపబడింది.

రుద్రాధ్యాయమందు హోమము చెప్పబడి యున్నది.

' నమకం చమకం చైవ
 పౌరుషం సూక్తమేవ చ !
నిత్యం త్రయం ప్రయుంజానో
బ్రహ్మలోకే మహీయతే '!!

నమక చమక పురుషసూక్తములను నిత్యము పారాయణ చేయువాడు బ్రహ్మలోకము పొందును.

' సురాపస్స్వర్ణహారీ చ
రుద్రజాపీ జలే స్థితః !
సహస్ర శీర్షజా2పి చ
ముచ్యతే సర్వ కిల్బిషైః '!!
జలమందు నిలిచి, నమక చమక పురుషసూక్తములను జపించిన మానవుడు సర్వ పాప విముక్తుడగును.

' ప్రయతః ప్రాతరుత్థాయ
యదధీతే విశాంపతే !
ప్రాంజలిః శతరుద్రీయం
నా2స్య కించన దుర్లభమ్ '!!

ప్రయత్నమున ఏ మానవుడు ప్రాతఃకాలమున సూర్యునికెదురుగా ప్రాంజలి చేసి, శతరుద్రీయము జపించునో, అతనికి దుర్లభమేదియును లేదు.

శ్రీకూర్మపురాణము నందు శ్రీకృష్ణుడు ఒక సంవత్సర కాలము పాశుపత దీక్ష నొందినవాడై, భస్మోధ్ధూళిత సర్వాంగుడై, రుద్రాధ్యాయ అధ్యయన తత్పరుడయ్యెనని వ్రాయబడినది.

జాబాలోపనిషత్తు నందు బ్రహ్మచారులు ' కిం జప్యేన అమృతత్వమశ్నుతే ?' దేనిని జపించుట చేత అమృతత్వము కలుగును ? అని ప్రశ్నింపగా, శ్రీయాజ్ఞవల్క్య మహర్షి - ' శతరుద్రీయేన ' ! శతరుద్రీయము జపించుటచేత అమృతత్వము కలుగును,
' ఏతైర్హవా అమృతో భవతి ' - 'మానవుడు శతరుద్రీయముతో హోమము చేసినచో అమృతుడగును' అని సమాధానమిచ్చెను.

కైవల్యోపనిషత్తునందు - ' యః శతరుద్రీయ మధీతే, సో2గ్ని పూతో భవతి '
శతరుద్రీయము నధ్యయనము చేసిన మానవుడు అగ్నిపూతుడగును - అగ్నిచే పవిత్రుడగును అని  చెప్పబడినది. 

" సతతం రుద్రజాప్యో2సౌ పరాం ముక్తిమవాప్స్యతి ".
నిరంతరము  రుద్రాధ్యాయమును జపించు మానవుడు ముక్తిని పొందునని స్మృతులయందు కలదు.

" అత్యాశ్రమీ సర్వదా సకృద్వా జపేత్ ( శతరుద్రీయం )
అనేన జ్ఞానమాప్నోతి
సంసారార్ణవ తారకమేతి " !!
నిరంతరము కానీ, ఎప్పుడో ఒకప్పుడు కానీ అత్యాశ్రమి - ఏ ఆశ్రమమున ఉన్నవాడైననూ, శతరుద్రీయము జపించినచో, జ్ఞానము కలుగును. కనుక సంసార సాగరమును తరింప వచ్చును.

" భస్మనిష్ఠా పరమేశ్వరాసక్తి పూర్వకాత్
ప్రతిదినం సకృదృద్రజపాదేన శివానుగ్రహేణ జ్ఞానోత్పత్తిః " !!
నిత్యము, లేక ఎప్పుడైనా, భస్మమును ధరించినవాడై మానవుడు పరమేశ్వరాసక్తి పూర్వకముగా రుద్రాధ్యాయమును జపించినచో, అట్టివానికి శివానుగ్రహము చేత జ్ఞానోదయమగును.

" భోగార్ధినో ముముక్షో వా
ప్రాయశ్చిత్తార్ధినో2పి వా
రుద్రోపనిషదం ముక్త్వా
గతిరన్యో న విద్యతే " !! అని శివపురాణం చెప్తోంది.
ఐహిక భోగములను కోరువానికి గాని, మోక్షమును కోరువానికి గాని, పాప ప్రాయశ్చిత్తములను కోరువానికి గాని రుద్రోపనిషత్తు కంటే అన్య శరణ్యము లేదు.

" సంసార తారణ జ్ఞానకామః శతరుద్రీయం జపేత్ " !
సంసారమును తరించు జ్ఞానము కోరువాడు శతరుద్రీయమును జపించవలెను.

" శతరుద్రీయాధ్యయనాదవిముక్త మాశ్రితో భవతి, అవిముక్తాశ్రయణ రూపం తదుపాసనం కృతవాన్ భవతీతి అవిముక్తోపాసన ఫలం ప్రాప్నోతి " !

శతరుద్రీయాధ్యయనము వలన అవిముక్తమును ఆశ్రయించినవాడగును. అవిముక్తాశ్రయణ రూపమైన ఈ శతరుద్రీయ అధ్యయనము చేసినవాడు అవిముక్తోపాసనా ఫలమును పొందును. అవిముక్త ఉపాసన అంటే ఒక్క క్షణం - సెకండు కూడా వదలకుండా నిరంతరం ఉపాసించటము.

తారక బ్రహ్మవిద్య అను పేరుగల ఆత్మతత్త్వ జ్ఞానము శ్రీరుద్రాధ్యాయ జపమాత్రము చేత అనాయాసముగా లభించును. కనుకనే జాబాలోపనిషత్తు నందు కేవల శతరుద్రీయ జపమాత్రము చేతనే మోక్షము లభించును, అమృతత్వము ప్రాప్తించును, అనాయాసముగా అవిముక్తోపాసన లభించును అని చెప్పబడినది. కనుక రుద్రాధ్యాయాధ్యయనము సర్వోత్తమము.

" పినాకపాణిం భూతేశ
ముద్యత్సూర్యాయుత ద్యుతిమ్ !
భూషితం భుజగైర్ధ్యాయే
త్కంఠే కాలం కపర్దినమ్ " !!
పినాకము అను విల్లు చేతియందు కలవాడును, భూతములకు పతియు, ప్రకాశించుచున్న పదివేల సూర్యుల కాంతి వంటి కాంతి గలవాడును, పాములచేత అలంకరింప బడిన వాడును, నీలమైన కంఠము కలవాడును, జడలు కలవాడును అగు రుద్రుని ధ్యానించ వలెను.

శ్రీ రుద్రాధ్యాయముల - నమక చమకముల సారము వాటి మధ్యలో అత్యంత రహస్యముగ, నిగూఢముగా, ఒక భవనములోపలి గదుల మధ్యలోని ఒక పేటికలో అత్యంత రహస్యముగా భద్రపరచబడి తాళము వేసి రక్షింపబడుచున్న వజ్రమువలె కాపాడబడుతున్న మహామహిమాన్వితమైన మహోత్కృష్ట మంత్రము పంచాక్షరీ మహామంత్రము - 'నమశ్శివాయ'.

" ఓం నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ నమశ్శృంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హన్త్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమశ్శఙ్కరాయ చ మయస్కరాయ చ నమశ్శివాయ చ శివతరాయ చ " !!

" శివమిచ్ఛన్మనుష్యాణాం
తస్మాద్దేవః శివః స్మృతః "!
మనుష్యులకు కల్యాణమును కోరువాడు కనుక దేవుడు 'శివుడు' అని చెప్పబడును.
ఈశ్వరుడు సకల కళ్యాణ గుణములకు నిధియైనవాడు కనుక సజ్జనులాయనను శివుడు అంటారు.

అధర్వశిరస్సు అనే ఉపనిషత్తులో -
' కిం ధ్యానం? కింవో ధ్యాతా ? కశ్చ ధ్యేయః ? ' అను ప్రశ్నలకు
' శివ ఏకో ధ్యేయః శివంకరః
సర్వమన్యత్పరిత్యజ్య ' !! అని సమాధాన మీయబడింది. ధ్యానము, ధ్యాత ధ్యేయము ఎవరన్న ప్రశ్నలకు అన్యమును సర్వమును విడిచి శివంకరుడగు శివుడే ధ్యానింప దగినవాడు అని చెప్పారు. ఈ మహామన్త్రము - నమశ్శివాయ - సకల శ్రుతిహారాయమానమగు రుద్రోపనిషత్తు - నమకము - నందు నాయకమణి యగు మహా మంత్రము.

" విద్యాసు శ్రుతిరుత్కృష్టా
రుద్రైకాదశినీ శ్రుతౌ !
తస్య పంచాక్షరీ, తస్య
శివమిత్యక్షర ద్వయమ్ " !!
విద్యలయందు శ్రుతులు - వేదములు ఉత్తమములు. శ్రుతులందు రుద్రాధ్యాయము ఉత్తమము. రుద్రాధ్యాయమున శివపంచాక్షరి ఉత్తమము. శివపంచాక్షరీ మంత్రమందు ' శివ' అను రెండక్షరములు ఉత్తమము.

ఆగమములందు ' శివ' శబ్దమునకు జీవరత్నమని ప్రసిద్ధి. హింసా ధాతువు నుండి సింహ శబ్దము వచ్చినట్లు, పశ్యతి - కశ్యప లాగా, ' దశ ' శబ్దం నుంచి ' శివ ' శబ్దం వచ్చింది.
శివపురాణం లోని సర్వమైన వచనములు శివ మంత్ర ప్రభావమునకు ప్రమాణములు.
రుద్రాధ్యాయములో, నమకములో, ఈ అనువాకమున శివపంచాక్షరీ మహామంత్రము ఇమడ్చబడటము చేత ఏకాదశానువాకములలో ఈ అనువాకమునకు అధిక ప్రాధాన్యము.

' పార్వతీ పరమాదేవీ, బ్రహ్మవిద్యా ప్రదాయినీ
తస్మాత్సహ తయా శక్త్యా
హృది పశ్యంతి యే శివమ్ ' !!
పరమమైన దేవి యగు పార్వతీదేవి బ్రహ్మవిద్యా స్వరూపిణి. శివుడు పరబ్రహ్మ. అందుచేత ఆమెతో కూడిన శివుని ఎవరు హృదయములో దర్శించెదరో, వారికి శాశ్వతమగు సిధ్ధి కలుగుతుంది. ఇటువంటి సిధ్ధి ఇతరముల చేత కలుగదు.

ఈశ్వరుడు అష్టవిధ మూర్తి.
కాళిదాస మహాకవి ఈశ్వరుని అష్టమూర్తి తత్వాన్ని ఇలా స్తోత్రించాడు.
 " యా సృష్టిః స్రష్టురాద్యా వహతి విధిహుతాం యా హవిర్యా చ హోత్రీ
యే ద్వే కాలం విధత్తః శ్రుతి విషయగుణా యా స్ధితా వ్యాప్య విశ్వమ్ !
యామాహుః సర్వభూత ప్రకృతిరితి యయా ప్రాణినః ప్రాణవన్తః
ప్రత్యక్షాభిః ప్రపన్నస్తనుభిరవతు వస్తాభిరష్టాభిరీశః " !!

పృథివ్యప్తేజోవాయురాకాశము లనబడే పంచ భూతములు, సూర్యచంద్రులు, 'నేను' అనబడే యజమాని - అనే ఎనిమిది రూపాలతో ఈశ్వరుడు విరాజిల్లుతున్నాడు. విశ్వరూపుడిని, ఇటువంటి మహత్తర శక్తి కల పరమాత్మను రుద్రుడిని ఏకాదశ రుద్రాభిషేకములతో ప్రసన్నుడిని చేయటం వలన ప్రకృతి మొత్తం ప్రశాంతత పొందుతుంది. సాంబసదాశివుని అర్చించి పరమేశ్వరానుగ్రహము పొందుదుము గాక !

సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశానములనబడే పంచ ముఖములతో నాలుగు దిక్కులను, ఊర్ధ్వ దిశను చూస్తూ జగత్తును రక్షిస్తున్న పరమాత్మకు, సాంబసదాశివుని కి,  లింగస్వరూపమైన పరబ్రహ్మ కు  పరమాత్మ కు ఆత్మార్పణము చేస్తున్నాను.

'ఏకమేవాద్వితీయం బ్రహ్మ' అని వేదము చెప్పిన ఏకమైన పరబ్రహ్మము, విశ్వముగా రెండుగా కనిపిస్తూ, త్ర్యంబకుడయి - సూర్యచంద్రాగ్ని లోచనుడయి, ముల్లోకాలనూ, మూడు కాలాలనూ ఒకేసారి చూస్తూ, సృష్టి స్థితి లయలను నిర్వహిస్తూ, త్రిపుటి తానే అని చెప్తూ, త్రికరణ శుద్ధిగా శరణాగతి చేస్తే, త్రివర్గాలనూ తొలగించి, అపవర్గాన్నిస్తానని చెప్తూ, చతుర్వేద సారమూ తానే అయి, పంచభూతాలనూ తనలోనుంచే ప్రభవిల్లజేసి, పంచేంద్రియాలను నిగ్రహించి తనను చేరమని చెప్తూ, షడ్రుతువులనూ ప్రభవిల్లజేసి, షడ్రుచులను మన ఆనందం కోసం అనుగ్రహించి, సప్తర్షుల రూపంలో, సప్తమాతృకల రూపంలో ప్రకృతిననుగ్రహిస్తూ, మనను కరుణిస్తూ, అష్టవిధమూర్తియై వెలుగొందుతూ, అష్టదిక్కులకూ, అష్టైశ్వర్యాలకూ అధినాయకుడయి, అణిమాది అష్టసిధ్ధి ప్రదాయకుడయి, నవనిధులకూ అధిపతియైన కుబేరునికి నవనిధి ప్రదాయకుడయి, నవ స్వరూపుడు పరిపూర్ణుడైన పరమాత్మను - శివుని  - మహేశ్వరుని - రుద్రుని పంచ జ్ఞానేంద్రియ పంచ కర్మేంద్రియాలనబడే  దశేన్ద్రియాలతోను అర్చించి, అంతఃకరణ చతుష్టయమనే అంతరింద్రియముతో కలిపి ఏకాదశేన్ద్రియములను - పదకొండు ఇంద్రియములను పరమేశ్వరార్పణ చెయ్యటమే ఏకాదశ రుద్రాభిషేకము.
' అభిషేక ప్రియోహ్యీశ్వరః ' ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. ఈశ్వరుడు విశ్వరూపుడు కనుక ఈశ్వరుని అభిషేకిస్తే విశ్వం చల్లబడుతుంది. పంచామృతాలతో, గంగాజలంతో ఈశ్వరుని - రుద్రుని అభిషేకించి, తుమ్మి పూలతో, మారేడు దళాలతో పూజించి, గోక్షీరాన్ని, కదళీ ఫలాన్ని నైవేద్యం పెట్టాలి.
చతుష్షష్టి ఉపచారాలతో అర్చించాలి. కుదరక పోతే షోడశోపచారాలతో నైనా పూజించాలి. మనకు పంచేంద్రియాలను అనుగ్రహించినందుకు కృతజ్ఞతగా కనీసం పంచోపచారాలతోనైనా పూజించాలి.

ఏకాదశ రుద్రాభిషేక ఫలం ఇంతింత అని చెప్పటం ఎవరి వల్ల కాదు. ముందు భౌతిక పూజ, తరువాత మానసిక పూజ ! అటుపై సర్వమూ శివమయమని గుర్తించి శివస్వరూపులమవాలి.

శివో2హం  శివో2హం  శివో2హం.
ఓం నమశ్శివాయ. నమశ్శివాయై చ నమశ్శివాయ.

సర్వం శ్రీ  సాంబసదాశివ స్వామినః  చరణారవిందార్పణమస్తు.

డా.విశాలాక్షి.

Comments