జంతూనాం నరజన్మ దుర్లభం: Importance of Human life --Dr Visalakshi

జీవునికి ముక్తి పొందటానికి ఎన్నోజన్మల పుణ్యఫలం వల్ల లభించేది మానవ దేహం. మానవ ఉపాధి లభించినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవటమే వివేకవంతుల లక్షణం.
'జంతూనాం నరజన్మ దుర్లభ మతః పుంస్త్వం తతో విప్రతాత్
తస్మాద్వైదిక ధర్మమార్గపరతా విద్వత్వమస్మాత్పరమ్ !
ఆత్మానాత్మ వివేచనం స్వానుభవో బ్రహ్మాత్మనా సంస్ధితిః
ముక్తిర్నో శత కోటి జన్మ సుకృతైర్పుణ్యైర్వినా లభ్యతే' !!
అని జగద్గురువులు శ్రీఆదిశంకర భగవత్పాదులు వివేకవంతమైన మానవ జీవిత మహోత్కృష్టతను గురించి చెప్పారు.

మానవ జీవితం షడ్భావ వికారాలతో కూడి ఉంటుంది. ప్రతి ప్రాణి, ప్రకృతి లోని ప్రతి వస్తువు ఈ షడ్భావ వికారాలకు లోనవుతుంది. షడ్భావ వికారాలు లేనిది కేవలము పరమాత్మ మాత్రమే ! షడ్భావ వికారాలు కలిగిన మనం షడ్భావ వికారాలు లేని స్థితిని చేరటానికి ప్రయత్నం చెయ్యాలి. షడ్భావ వికారాలు - జాయతే, అస్తి, వర్ధతే, విపరిణమతే, పరిక్షీయతే, వినశ్యతి అనునవి.
సృష్టిలో ప్రతిదీ ముందు పుడుతుంది. పుట్టింది కనుక అది ఉంటుంది. అస్తి ముందు చెప్పి జాయతే తరువాత కూడా చెప్పవచ్చును. ఉన్నది. ఆ ఉన్నది అన్నదే పుట్టింది. పుట్టినది వర్ధతే - వృద్ధి చెందుతోంది. వృద్ధి చెందుతూ ఎదగడంలోనూ, ఎదిగిన తరువాత కూడా విపరిణమతే - మార్పు చెందుతోంది. మార్పు చెందుతూ అది క్రమంగా క్షీణిస్తుంది. చివరికి నశించిపోతుంది. మానవులైనా, జంతువులైనా, పక్ష్యాదులు, వృక్షాలు కూడా ఈ ఆరు వికారాలను పొందుతూనే ఉంటాయి. ఈ షడ్భావ వికారాలలోను అంతర్గతంగా ఉండి, షడ్వికారాలు లేనిది కేవలం చిచ్ఛక్తి మాత్రమే ! అన్ని వికారాలలోను కూడా ఉన్నది 'ఉన్నది' అనేది.
'జాయతే' అన్నప్పుడు పుట్టి ఉన్నది. పుట్టినది ఉన్నది. 'ఉన్నది' పెరుగుతూ ఉన్నది. తరువాత మార్పు చెందుతూ ఉన్నది. నశించిపోతూ ఉన్నది.  ఉన్నదే నశించిపోతూ ఉన్నది. ఆ ఉన్నది అన్నదే 'సత్'. ఉన్నది అంటేనే అందులో చైతన్యం - చిత్ శక్తి ఉంటుంది. 'చిత్' - చైతన్యం ఉంది కనుకే పుడుతోంది, పెరుగుతోంది, నశిస్తోంది. అంటే సత్ తో పాటు ఉన్నది చిత్. ఈ సత్ చిత్ లు శాశ్వతంగా ఆనందంతో కలిసి ఉంటే, ఈ మూడు ఏకమైతే అదే సచ్చిదానందం - పరబ్రహ్మ లక్షణం. సచ్చిదానందం శాశ్వతమైతే, పరబ్రహ్మ, అశాశ్వతమైనప్పుడు, జీవుడు. ఉన్నది అనేది శాశ్వతమే ! కానీ ఉపాధులు - మన శరీరాలు - శాశ్వతంగా ఉండవు. మార్పు చెందుతూ ఉంటాయి. ఉపాధులతో అనుభవించే ఆనందం క్షణికమైనది. అది శాశ్వతం కాదు. మార్పు చెందే ఉపాధులలో ఉన్న మనం మార్పు చెందని శాశ్వతత్వాన్ని పొందాలి అంటే మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో మన మహర్షులు చెప్పారు, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. మనం మన జీవిత కాలంలో పుట్టినప్పటి నుంచి పెరిగి యౌవనవంతులమయే లోపలే నిజమైన జ్ఞానాన్ని సరైన పద్ధతిలో గ్రహించాలి. జీవితపు విలువలను, నైతిక విలువలను గుర్తించి అలవరచుకోవాలి. క్రమబద్ధమైన జీవన విధానం అలవడాలి. సనాతన సంస్కృతి మనలో జీర్ణించిపోవాలి. సనాతన జీవన పద్ధతి మన జీవితంలో ప్రవర్తనలో కనుపించాలి. శారీరకంగా శక్తిమంతులై, మానసికంగా పరిపక్వత కలిగిన యువత వార్ధక్యం వచ్చి శారీరిక మానసిక శక్తి సన్నగిల్లే లోపలే, మానవ జీవితం లభించినందుకు చెయ్యవలసిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చి, అనుస్యూతంగా అనుక్షణమూ జీవన్ముక్త స్థితిని పొందటానికి ప్రయత్నిస్తూ, ఏ క్షణాన శరీరాన్ని త్యజించవలసి వచ్చినా, తన ఆత్మ పరమాత్మలో లీనమవుతుందనే నిశ్చయ స్థితిలో ఉండగలగాలి. కుండ బద్దలైతే కుండలోని ఆకాశం మహాకాశమే అయినట్లుగా మన శరీర ఘటం బ్రద్దలవగానే అందులో ఉన్న జీవాత్మ విశ్వాత్మలో ఏకమవగలగాలి. ఆ లోపలే చిత్తశుద్ధి కలిగించే నిత్యనైమిత్తిక కర్మలను, ధార్మిక కర్మలను చెయ్యాలి. 'మానవ సేవే మాధవ సేవ' అన్న సత్యాన్ని గుర్తించి, మనం పుట్టిన మతానికి, దేశానికి, భాషకు, మన కుటుంబానికి, బంధువులకు, తోటివారి పట్ల మన బాధ్యతలను నిర్వర్తించాలి.
మన పూర్వ కర్మానుసారంగా మనకు లభించిన ఉపాధి ధర్మాలను పాటిస్తూ, బాధ్యతలను నెరవేరుస్తూనే, అసలైన జ్ఞానాన్వేషణ సాగించాలి. సదసద్వివేకాన్ని వృద్ధి చేసుకోవాలి. జ్ఞానాదేవ తు కైవల్యమ్.

🙏🌹ఓం తత్సత్. 🌹🙏
డా.విశాలాక్షి.

Comments