śrī kr̥ṣṇārpamaṇamastu By Dr viśālākṣi
పూజంతా అయ్యాక చివరిలో - 'పాపో2హం, పాప కర్మా2హం, పాపాత్మా పాప సంభవః ...' అంటాము కదా ! ఎందుకు ? నేనేమీ పాపాలు చెయ్యలేదు కదా ! అలా ఎందుకనాలి? అని ఒకరి సందేహం ! దాన్ని తీర్చమని అడిగారు.
🙏🌹
యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ !
తాని తాని వినశ్యంతి ప్రదక్షిణ పదే పదే ! పాపో2హం పాప కర్మా2హం పాపాత్మా పాపసంభవః !
పాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల ! అన్యథా శరణం నాస్తి
త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర !! అంటూ ప్రార్ధిస్తాము.
మనం అసలు పాపాత్ములమే కాదు. మనం పరబ్రహ్మ స్వరూపులము. మనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త సచ్చిదానంద ఆత్మ స్వరూపులము.
వేదవాణి మనను
'శృణ్వంతు సర్వే అమృతస్య పుత్రాః ....' అంటూ సంబోధించి ప్రబోధించింది. అమృతము అంటే మరణము లేనిది, అంటే పరమాత్మ. అమృతస్య పుత్రాః అంటే పరమాత్మ నుంచి ఉద్భవించిన సంతానం. ఇటువంటి వారు పాపాత్ములెలా అవుతారు ?
మరి మనం 'పాపో2హం, పాప కర్మా2హం ...' అని ఎందుకంటాము ?
మనం చేసే పనులతో, మాట్లాడే మాటలతో, మనస్సు లో కలిగే ఆలోచనలతో మనం కావాలని చేసినా వద్దని చేసినా, పుణ్యము, పాపము తప్పని సరిగా కలుగుతాయి. కనుక మనం చేసిన పాపాన్ని ఎప్పటికప్పుడు మనం పోగొట్టుకోవాలి. పూజ చివరిలో - కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం ! విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివశివ కరుబ్దే శ్రీ మహాదేవ శంభో !! అంటాము.
సంధ్యావందనం చేసేటప్పుడు ఏ పూట చేసిన పాపం ఆ పూట చేసే సంధ్యావందనంతో పోతుంది, అనే మంత్రాలున్నాయి. అలా పగలు చేసే పనుల వల్ల కలిగే పాపం పగలు చేసే సంధ్యావందనం తోను, రాత్రి చేసిన కర్మల పాపం రాత్రి చేసే సంధ్యావందనంతోను పోగొట్టుకుంటున్నారు.
యదహ్నాత్ కురుతే పాపం
తదహ్నాత్ ప్రతి ముచ్యతే !
యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యా ప్రతిముచ్యతే !!
మన ప్రమేయం లేకుండా మనకు కలిగే పాపాలు ఇలా తొలగిపోతాయి కానీ కావాలని స్వార్ధంతో చేసే పాపాలు తొలగవు. వాటి ఫలం అనుభవించాల్సిందే ! పాపం ఉంటే సద్గతికి వెళ్ళలేము. పాప ప్రక్షాళన అవాలి.
మనం అసలు పాపమే చేసి ఉండక పోతే మనుష్యులుగా పుట్టే వాళ్ళమే కాదు. పూర్తిగా పుణ్యమే ఉన్నవాళ్ళు, పూర్తి సత్త్వగుణ సంపన్నులు దేవతలవుతారు. పూర్తిగా తమోగుణ సంపన్నులు చెట్లు చేమలుగా పుడతారు. తమోగుణ, రజోగుణ సంపన్నులు రాక్షసులవుతారు. సత్త్వరజస్తమో గుణాలు మూడు హెచ్చు తగ్గులలో ఉన్నవారు మానవులుగా పుడతారు. మానవులలో సత్త్వ, రజస్, తమో గుణాలలోని హెచ్చు తగ్గులను బట్టి మానవులలోనే, దేవతలు, మానవులు, రాక్షసులు కూడా ఉంటారు. మానవత్వం నుంచి దైవత్వానికి ఎదగటానికి మన సాధన ద్వారా ప్రయత్నించాలి.
ఈ ప్రపంచమే సత్యము అనుకునే అజ్ఞానమే పాపము. వివేచనతో ఈ అజ్ఞానం లోంచి బైట పడటమే పాపాన్ని పోగొట్టు కోవటము, పుణ్యాన్ని సంపాదించటము.
మన అసలు స్వరూపం పరబ్రహ్మ తత్త్వం. కానీ అజ్ఞానం లో ప్రతిఫలించిన పరమాత్మ తనను తానే జీవునిగా భావించుకుంటోంది. ఆ జీవునికి తన్మాత్రలతో ప్రకృతిలోని భోగాలను అనుభవించటానికి ఒక శరీరము ఉపాధిగా దొరుకుతున్నది. ఆ ఉపాధిలో ఉండి, ఇంద్రియాలు, ప్రాణముతో కలిసి చిత్తవృత్తుల ద్వారా సుఖ దుఃఖాల ననుభవిస్తూ, పాపపుణ్య కార్యాలను చేస్తున్నాడు. ఆకలి దప్పికలు ప్రాణ లక్షణాలైనట్లుగా
పాపము, పుణ్యము అనేవి జీవునికి సంబంధించినవి. జీవుడు చేసిన కర్మల ఫలం పాప పుణ్యాలను కలిగిస్తుంది. కనుక మనకు పాప పుణ్యాలున్నాయి. ధర్మాచరణ వల్ల పాపం నశిస్తుంది. పరోపకారం చెయ్యటం వల్ల, ధర్మకార్యాచరణ వల్ల పుణ్యం కలుగుతుంది. పాప పుణ్యాలు ఏవీ మిగలకుండా చేసుకుని, స్వధర్మాన్ని నిష్కామంగా, భగవదర్పణ భావంతో ఆచరిస్తుంటే పాపపుణ్యాలు నశించిపోతాయి. సంచితం నశించిపోతుంది.
'ప్రారబ్ధం భోగతో నశ్యేత్'
అనుభవించి ప్రారబ్ధాన్ని పోగొట్టుకోవాలి. అప్పుడు పాపము ఉండదు, పుణ్యము ఉండదు. అటువంటి స్థితిని పొందేలా మన ప్రవర్తన ఉండాలి. అను నిత్యము అటువంటి జీవితం గడుపుతూ, 'యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్', అని ఈశ్వరార్పణ భావంతో కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉండేవారు చేసే ఏ పని ఫలితమూ వారినంటదు. పాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల ! - దయతో నన్ను రక్షించు అని ప్రార్ధించటము తప్పులు చేసి పాపాలుకలగకుండా కాపాడమని చేసే ప్రార్ధన కాదు. అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, అని పరమాత్మను సర్వస్య శరణాగతి చేసి సర్వ సమర్పణ భావంతో జీవించటమే ! మామూలుగా పూజ చేసేటప్పుడు
మనకు పెద్దలు అలవాటు చేసిన నిత్య పూజలో సాధారణంగా - ధర్మార్ధకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిధ్యర్ధం అంటూ, ఇష్ట కామ్యార్ధ సిధ్యర్ధం అంటూ ఇంకా మనకు కావలసినవి కూడా చెప్పుకుంటాము. భావం తెలుసుకుని చెప్పుకోవాలి, చెప్పిన దానిని ఆచరించాలి.
గురూపదేశం పొందిన వారు - మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పార్వతీ పరమేశ్వర ప్రీత్యర్ధం, (జపించే దైవం పేరు) గురూపదేశమంత్ర సిధ్యర్ధం, మమషడూర్మ్యాది రహిత షట్స్ధల పరబ్రహ్మ నిర్వాణ సుఖసంపదవాప్త్యర్ధం, గురూపదేశ మంత్ర సిధ్యర్ధం, గురూపదేశ మంత్ర జప మహం కరిష్యే ! అని చెప్పుకుంటాము. 'ఆత్మా త్వం గిరిజా మతిః పరిజనాః ప్రాణాః శరీరం గృహం,
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధి స్థితిః
సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వా గిరాః
యద్యద్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్'
అనే భావన ఏర్పడినప్పుడు ఏ కర్మ ఫలం అంటదు.
🙏🌹
డా.విశాలాక్షి
Comments
Post a Comment