śivanaṁdalahari ślōkaṁ-1 Dr viśālākṣi



🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమశ్శివాయ
శివానంద లహరి
శ్లోకం - 1

కళాభ్యాం, చూడాలంకృత శశి కళాభ్యాం, నిజతపః
ఫలాభ్యాం, భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం, భవతు మే
శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం, హృదిపునర్భవాభ్యాం, ఆనందస్ఫురదను భవాభ్యాం నతిరియమ్ !! 1 !!

ఈ శ్లోకానికి పదాన్వయం చూద్దాము.
శివాభ్యాం ఇయం మే నతిః భవతు. ఇయం శివాభ్యాం మే నతిః భవతు. అంటే జగత్పితరులగు పార్వతీపరమేశ్వరులకు నమస్కరించు చున్నాను. ఇయం అనే పదమునకు అర్ధము ఈ. ఈ పితరులకు అనవచ్చును. అప్పుడు  ప్రత్యక్షంగా మన ఎదుట  ఉన్న వారు అని స్ఫురిస్తుంది. అంటే  వారు ఎక్కడో లేరు. ఇక్కడే ఉన్నారని  అర్ధమవుతుంది. ఈ శివ పార్వతులు అని  చెప్తున్నాము.
పితరులకు ఈ నమస్కారములు చెందునుగాక ! అనవచ్చును. ఇది ఈ శ్లోకంలో ముఖ్యమైన వాక్యము. మిగతా పదాలన్నీ ఈ 'శివాభ్యాం' అనే పదానికి విషేషణాలు. ఎటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారములు ఛేస్తున్నాము అంటే, కలాభ్యాం, చూడాలంకృత శశికళాభ్యాం, నిజ  తపః ఫలాభ్యాం, భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం, అస్తోక త్రిభువన శివాభ్యాం, హృది పునర్భవాభ్యాం, ఆనంద  స్ఫురదనుభవాభ్యాం అయినటువంటి త్రిపుర సుందరీ సుందరేశ్వరులకు అన్నమాట !  ఈ పదాలన్నీ శివాభ్యాం కి  విశేషణాలు. ఇటువంటి  శివపార్వతులకు ఈ నా నమస్కారములు చెందుగాక  !

శివశ్చ శివా చ శివే.  తాభ్యాం శివాభ్యాం అని విగ్రహవాక్యం చెప్పాలి. 
కలాభ్యాం = సకల కళల యొక్క స్వరూపము తామే అయిన వారు (అగు పార్వతీ పరమేశ్వరులకు, త్రిపుర సుందరీ,  సుందరేశ్వరులకు  ఇరువురికీ)
చూడాలంకృత శశికలాభ్యాం = శిరస్సుపై చంద్రరేఖను అలంకరించుకున్నవారు
నిజతపః ఫలాభ్యాం = పరస్పరము ఒకరి తపస్సునకు మరియొకరు ఫలముగా లభించినవారు.
భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం = భక్తులకు విశేషముగా వరములను ప్రసాదించువారు
శివాభ్యాం = పరమ మంగళ స్వరూపులగు కామేశ్వరీ కామేశ్వరులకు
అస్తోక త్రిభువన శివాభ్యాం = మూడు భువనములకును విశేషముగా శుభములను కలుగజేయువారును
హృది పునర్భవాభ్యాం = (నా, మన) హృదయమునందు మరలా మరలా దర్శనమిచ్చువారును
ఆనన్ద స్ఫురదనుభవాభ్యాం = ఉప్పొంగుతున్న ఆనంద స్థితిని అనుభవించువారు, అనుభవింపజేయువారును (అయిన పార్వతీపరమేశ్వరులకు)
ఇయమ్ = ఇవి
మే = నా యొక్క
నతిః భవతు = నమస్కారములు అగుగాక !

సకల కళలయొక్క స్వరూపము తామే అయిన వారు, శిరస్సున చంద్రరేఖను ధరించినవారు, పరస్పరము ఒకరి తపస్సునకు మరియొకరు ఫలముగా లభించినవారు, భక్తులకు విశేషముగా వరములను ప్రసాదించువారు, పరమ మంగళ స్వరూపులు, త్రిభువనములకును విశేషముగా శుభములను కలుగజేయువారు, నా హృదయమునందు మరలా మరలా దర్శనమిచ్చువారు, నిరంతరమూ ఉప్పొంగుతున్న ఆనంద స్థితిని అనుభవించువారును అయిన పార్వతీ పరమేశ్వరులకు ఇవియే నా నమస్కారములు ! నేను నమస్కరించు చున్నాను.

శివము ఆనందము యొక్క లహరి - అంటే ప్రవాహము. సముద్రములో, నదిలో అలలు ఒకదాని తరవాత ఒకటిగా వస్తూనే ఉంటాయి. అలాగే ఈ స్తోత్ర శ్లోకాలలో భక్తి అనే అలలు ఊప్పొంగుతూనే ఉంటాయి. శుభము ఆనందము ఎడతెరపి లేకుండా అనవరతము వస్తూనే ఉంటుంది. చదివిన  కొద్దీ  కొత్తభావాలను  కలిగిస్తాయి కనుక  లహరి.  శివ శివుని యొక్క ఆనంద లహరి, శివా  - పార్వతీదేవి యొక్క  ఆనంద లహరి. శివపార్వతుల ధ్యానదర్శనాల వల్ల మనకు కలిగే ఆనందలహరి !

శివానన్దలహరీ స్తోత్రాన్ని
పరమ పవిత్రమైన 'క' వర్ణంతో ప్రారంభించారు జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులవారు. శ్రీవిద్య - పంచదశీ కాదివిద్య కకారంతో ప్రారంభమవుతుంది. పార్వతీ పరమేశ్వరుల తత్వాన్ని, అర్ధనారీశ్వర తత్త్వాన్ని ఆవిష్కరించారు ఈ శ్లోకంలో. శివ శివానీలిద్దరూ ఒకే రకమైన లక్షణ లక్షితులు, అర్ధనారీశ్వరులు, అవినాభావ ఆది దంపతులు. జగద్గురువుల విరచితమైన సౌందర్యలహరి ప్రతి మంత్రశ్లోకము జగన్మాత యొక్క మంత్ర తంత్ర యంత్ర సౌందర్య స్వరూప ఆనంద ప్రవాహము. శ్రీవిద్యా రహస్యాలతో నిబిడీకృతమై, మంత్రానుష్ఠాన ద్రష్టలకు హృదయానందసంధాయకమై అలరారుతున్నది. శివానందలహరి ఏ మంత్ర తంత్ర యంత్ర కాఠిన్యము లేక, కేవలము లోనుండి పెల్లుబికిన పరిపూర్ణ భక్తిరస ప్రవాహము, నీవే తప్ప ఇతః పరంబెరుగనని చేసే శరణాగతితో కలిగే ఆనందపారవశ్య లహరి. సూర్యునికి వెలుగు వలె, కిరణముల వలె శివుని యొక్క శక్తి శివా. సౌందర్యలహరి ప్రథమ శ్లోకంలోను, శివానందలహరి ప్రథమ శ్లోకంలో కూడా వీరిరువురి ఏకత్వం, అవినాభావత్వం ప్రకటించ బడింది. అక్కడ 'శివః శక్త్యా యుక్తో యది, భవతి శక్తః ప్రభవితుం. న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి' అన్నారు ఆచార్యులవారు. శివుడు శక్తితో కలిసినప్పుడే సృష్టి మొదలైన పంచ కృత్యాలను చెయ్యటానికి సమర్ధుడవుతాడు. శక్తి లేకపోతే, శివునిలో స్పందనైనా ఉండదు.  ఇక్కడ, శివాభ్యాం అంటూ వారిద్దరి యొక్క ఏకత్వ లక్షణాలను వివరించారు. శివుడు లేకపోతే శక్తి ప్రకటనే ఉండదు. విద్యుత్తు అనేకమైన భౌతిక పరికరాలలో అంతర్లీనంగా వ్యక్తమౌతుంది. శివుని సంకల్ప శక్తి అమ్మవారిలా ప్రకటితమౌతున్నది. కనుక వారి అభిన్న తత్త్వాన్ని అర్ధం చేసుకోవాలి.

కళాభ్యాం = అంటే సంపూర్ణ కళలతో కూడిన వారు, సకళ నిష్కళ రూపాలలో ఉండువారు. పదహారు కళలకు నిలయమైన చైతన్య ద్వయమునకు, విద్యా స్వరూపులకు అని అర్ధము. విద్య అంటే చదువు. వేదములను, శాస్త్రములను, సమస్త కళలను తెలుసుకోవటమే విద్య. అసలైన విద్య బ్రహ్మవిద్య. లౌకికమైన విద్యలు, చతుష్షష్ఠి కళలు. సూర్య చంద్ర అగ్నికి ఉన్న కళలు అన్నీ వీరు అనుగ్రహించినవే ! ఆయనే గురు స్వరూప శ్రీదక్షిణామూర్తి, ఆవిడే జ్ఞాన ప్రదాయక శ్రీజ్ఞానప్రసూనాంబ !

చూడాలంకృత శశి కళాభ్యాం = చూడాలో - సిగలో అలంకరించ బడిన చంద్రరేఖ కలవారు. ఇద్దరి శిరస్సులపైనా చంద్రరేఖ ప్రకాశిస్తూ ఉంటుంది. చంద్రుడు అమృతత్వానికీ, ఆహ్లాదకత్వానికీ, ఙకాంతికీ ప్రతీక ! 'చంద్రమా మనసో జాతః'. చంద్రుడు మనః కారకుడు. అంటే మనస్సులో కలిగే భావాలకు కారకుడు. మనస్సును నిగ్రహించటానికి సంకేతం చంద్రవంకను ధరించటం. మన మనస్సును మన అధీనంలో ఉంచుకోవాలని చెప్తున్నారు. ఇద్దరూ అమృత స్వరూపులు, అమృత ప్రదాయకులు, అలౌకికానంద స్వరూపులు అని తెలియజెయ్యటమే, ఇద్దరి తత్త్వం ఒక్కటేనని చెప్పటమే ఇద్దరూ చంద్రవంక ధరించటం ! ఆది దంపతుల ప్రథమ పుత్రుడు శ్రీమహాగణపతి కూడా చంద్రరేఖను కలిగి ఉంటాడు. '.... ఫాలచంద్రో గజాననః ...' వీరు ధరించిన చంద్రరేఖ అష్టమినాటి చంద్రునిది.ఠ' అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా'. అష్టమి నాటి చంద్రునిలో శక్లపక్షంలోను, కృష్ణపక్షంలోను కూడా కళలలో తేడా ఉండదు. అప్పుడు చంద్రుడు  ఒకేలా ఉంటాడు హెచ్చు తగ్గులు లేకుండా ! అంటే శివపార్వతుల చిద్విలాసంలో, ఆనంద ప్రకటనలో వన్నె తగ్గదని అర్ధం.

నిజ తపః ఫలాభ్యాం = తమ తమ తపస్సుల ఫలితంగా ఒకరి నొకరు పొందిన వారు.
ఎల్లప్పుడూ ఇద్దరూ పరస్పరము ధ్యానించుకుంటూ ఉంటారు. ఈశ్వరుడు దక్షయజ్ఞం తరువాత సతీ వియోగంతో జగన్మాత కోసం తపస్సు చేశాడు. అమ్మవారు పార్వతీదేవిగా ఉద్భవించి, పరమేశ్వరుని కోసం తపస్సు చేసింది. ఇద్దరూ వారి వారి తపస్సుల ఫలంగా ఒకరి నొకరు పొందారు. జగదేక దంపతులైన శివా శివులు అవినాభావులైనా, విడినట్లు లీల ప్రదర్శించి, ఒకరినొకరు పొందటం వల్లే, వినాయకోత్పత్తి, శ్రీ సుబ్రహ్మణ్య జననం జరిగాయి, తారకాసుర సంహారం జరిగి లోకాలు సుఖించాయి.

భక్తేషు ప్రప్రకటిత ఫలాభ్యాం =  అంటే అమ్మవారు అయ్యవారు ఇద్దరూ ఏకమై భక్తులను అనుగ్రహిస్తారు, భక్తులు కోరిన ఫలాల ననుగ్రహిస్తారు. అంటే మనం కూడా తపిస్తే, తపస్సు చేస్తే, ఏ కోరికతో చేస్తే వాటిని పొందుతాము. ఏ కోరిక లేకుండా చేస్తే, పరమాత్మను పొందుతాము అని చెప్తున్నారు. ఐహికాముష్మికమైన
సమస్త కామనలను తీర్చటమే కాక నిశ్శ్రేయస్సును అనుగ్రహిస్తారు. భక్తులు కోరిన దానికంటే అధికంగా అనుగ్రహిస్తారు. '.... దాతుం ఫలమపి చ వాంఛా సమధికమ్...' అన్ని కోరికలలోకీ నిజమైన కోరిక, జీవిత పరమ పురుషార్ధము - మోక్షము - జనన మరణ వలయం లోనుంచి బైట పడటము. మరి పుట్టకుండా ఉండాలన్నా, పుట్టాక ముక్తి పొందాలన్నా, పుట్టుకకు కారణమైన కాముని, మరణానికి హేతువైన కాలుని జయించినవాని పాదాలు పట్టుకుని శరణాగతి చెయ్యాలి. అప జనన మరణాలు నశిస్తాయి. పుట్టుకకు కారణమైన కామ ప్రేరకుడైన మన్మథుని ముక్కంటి తన కంటి మంటతో కాల్చేశాడు. అల్పాయుష్మంతుడైన మార్కండేయుడు పరమేశ్వర లింగాన్ని ఆలింగనం చేసుకుని మృత్యుంజయ మంత్ర జపం చేస్తుంటే, యమధర్మరాజు అతని మీదకు మృత్యుపాశం వేస్తాడు. అప్పుడు శివుడు యముడిని తన ఎడమ పాదంతో తన్ని, మార్కండేయుని చిరంజీవిని చేశాడు. ఈశ్వరుని వామపాదం అమ్మవారిదే కదా ! కనుక జన్మ లేకుండా ఉండటానికి, మరణం లేకుండా శాశ్వతత్వం పొందటానికి, ఆది దంపతులనే ఆశ్రయించాలి. జగద్గురువులు శ్రీ కంచి పరమాచార్య స్వామివారు "కంటితో కాముని కాల్చివేశాడట, కాలితో కాలుని తన్నివేశాడట" అని చెప్పారని 'జగద్గురు బోధలు' గ్రంథంలో శ్రీ జి.ఎల్.ఎన్.శాస్త్రిగారు వివరించారు.

అస్తోక త్రిభువన శివాభ్యాం =  ముజ్జగములలోని వారికీ సకల సన్మంగళాలనూ అత్యధికంగా కూర్చగలిగినవారు. సృష్టి, స్థితి, లయలను చేసే పరమేశ్వరుడు ప్రళయకాలంలో కూడా సమస్త జగత్తును తనలో నిక్షిప్తం చేసి రక్షిస్తాడు. సృష్టి వ్యక్తమైనప్పుడు జగన్మాత శాకంబరీదేవిగా జీవజాలాన్ని పోషిస్తున్నది.

హృది = హృదయంలో పునర్భవాభ్యాం = మళ్ళీ మళ్ళీ ప్రత్యక్షమగువారు. పరమాత్మ ఎల్లప్పుడూ మన హృదయంలోనే ఉంటాడు. శరీరమంతటా పరమాత్మ శక్తి ఉన్నా, మనం హృదయంలో పరమాత్మను ధ్యానిస్తాము. 'ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశే2ర్జున తిష్టతి', అని పరమ గీతలో చెప్పాడు. పార్వతీ పరమేశ్వర రూపంలో ఉన్న పరమాత్మ నిత్యుడు. కానీ మన ప్రార్ధన వల్ల పార్వతీ పరమేశ్వర శక్తి  మన హృదయంలో మళ్ళీ పుట్టినట్లుగా మళ్ళీ మళ్ళీ దర్శనమిస్తారు. అందుకే వేదము ఈశ్వరుడిని 'సద్యోజాతుడు' అన్నది. అక్కడికక్కడ అవతరించే వాడు. 'సద్యోజాతం ప్రపద్యామి, సద్యో జాతాయ వై నమో నమః.' మనమెప్పుడు స్మరించినా మన హృదయంలో సాక్షాత్కరిస్తారు.

ఆనంద = ఆనందము యొక్క
స్ఫురత్ = ప్రకాశించు శక్తిని
అనుభవాభ్యాం = అనుభవించువారు. అనుక్షణము ఆనంద స్ఫురణను తాము అనుభవిస్తూ, భక్తులను అనుభవింపజేయువారుపార్వతీ పరమేశ్వరులు. వారు ఆనందఘనులు. వారిని ఆరాధించువారికి వారి అనుగ్రహం వలన హృదంతరాళాల్లోంచి ఆనందం పెల్లుబుకుతుంది. వారే ఆనంద స్వరూపులవుతారు. ఏ సమస్య కలిగినా, పరమేశ్వరుని స్మరిస్తే, తటిల్లతలా, మెరుపు మెరిసినట్లుగా ఒక భావవీచిక స్ఫురిస్తుంది. ఒక ఆనందానుభూతి కలుగుతుంది. ఆనందమే వారు, వారి వద్ద ఉన్నది ఆనందము కనుక వారిని ఆశ్రయించిన భక్తులకు ఆనందాన్ని అనుగ్రహిస్తారు. పరమాత్మను ' రసో వై సః ' అన్నది వేదము. పరమాత్మ రస స్వరూపుడు. రసము అంటే సారము. ఒక పండు యొక్క రసమే దాని సారము. దానిననుభవించటం లోనే ఆనందం ఉంటుంది. అలాగే ఈ విశ్వమంతా నిండి ఉన్న పరమేశ్వరుని సారమే ఆనందము. పార్వతీ పరమేశ్వరులను స్మరిస్తే, అలాంటి ఆనందానుభూతి కలుగుతుంది. ఆనందమే మన స్వరూపమనే ఎరుక కలుగుతుంది.

అటువంటి
శివాభ్యాం = శివశివాలకు - పార్వతీ పరమేశ్వరులకు, శివాభ్యాం అన్నది శివ శబ్దము యొక్క చతుర్ధీ విభక్తి ద్వి వచనము. ఇద్దరు శివుల కొరకు అని అర్ధము. తౌ అంటే సః చ సా చ అయినట్లుగా, శివాభ్యాం అంటే శివః చ శివా చ అని చెప్పాలి.
"యశ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా !
తయోః సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం" !!
నామ, రూప, గుణ, లీలా, వైభవాలను బట్టి ఏ దేవుడు మంగళకరుడో, శుభంకరుడో, ఏ దేవి సర్వమంగళా స్వరూపిణియో, వారిరువురినీ స్మరించటం వలన సర్వత్రా జయము, శుభము కలుగుతుంది.
అటువంటి పార్వతీ పరమేశ్వరులకు

మే = నా యొక్క
ఇయం నతిః = ఈ నమస్కారములు.

భవతు = అగుగాక ! సమర్పిస్తున్నాను.

'శివ' అనే పదం లోనే శివుడు శక్తి ఇద్దరూ ఉన్నారు. శకారం శివ స్వరూపం, ఇకారం శక్తి బీజం. శివ లో నుంచి ఇ ని తీసేస్తే చలనం, చైతన్యం, స్పందన లేని వాడవుతాడు. ఇ కలిస్తే సర్వ మంగళ స్వరూపుడవుతాడు.
" శివః శామ్యతి పరమానంద రూపత్వాన్నిర్వికారో భవతి ఇతి శివః " అని అమరకోశంలో చెప్పారు. అటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను.

🙏🌹
డా.విశాలాక్షి

Comments