శ్రీ బాల ముకున్దం భజరే ! చిన్ని కృష్ణుని బాల లీలలు డా.విశాలాక్షి Sri Krishna Leelas Dr Visalakshi

🙏🙏🙏🙏🙏
శ్రీ బాల ముకున్దం భజరే ! చిన్ని కృష్ణుని బాల లీలలు.
🙏🙏🙏🙏🙏

చిలిపి కృష్ణుడు ఇంట్లో ఉన్నట్లే ఉంటాడు. ఒక్క నిముషంలో పరుగెత్తి, తన స్నేహితులతో కలిసి గోపవనితల ఇళ్ళల్లోకెళ్ళి పాలు పెరుగు తాగేసి, వెన్నలారగించి తుర్రుమంటుంటాడు. ఏ ఒక్కరి ఇల్లూ వదలకుండా అందరి ఇళ్ళకీ వెళతాడు. ఏ రోజు ఏ ఒక్కరి ఇంటికి చిన్ని కృష్ణుడు రాకపోయినా వాళ్ళకి బెంగే  ! చిన్ని కృష్ణుడు ఎందుకు రాలేదో, ఎప్పుడొస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు. తలుపులు తీసి పెట్టి, తాము కనిపిస్తే రాడేమో అని ఎక్కడో నక్కి చూడటమో,  నిద్ర నటించటమో చేస్తారట గోకులంలో గోపవనితలు.
ఇది వారి అసలు స్థితి. పైకి మటుకు కృష్ణుడు మా ఇళ్ళల్లో పాలు పెరుగు దొంగిలిస్తున్నాడు అంటూ యశోదమ్మకి ఫిర్యాదు చేస్తారు.
" ఓయమ్మ ! నీ కుమారుడు
మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా  !
పోయెదమెక్కడికైనను
మాయన్నల సురభులాన మంజులవాణీ ! "
యశోదమ్మ చిన్ని కృష్ణుని ముఖం చూసింది. కృష్ణుడు తను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు. ఇంకేం  !
యశోదమ్మ మా అబ్బాయికేమైనా మాఇంట్లో పాలు పెరుగు కొదవా మీ ఇంటికి రావటానికి ! మీరు చెప్పే కల్లలు నేను నమ్మను అని చెప్పింది. దాంతో గొల్లభామలందరూ మీ అబ్బాయి మా ఇంట్లో దొంగిలిస్తుండగా పట్టుకుని నీ ముందు నిలబెడతామని చెప్పి వెళ్ళి, కృష్ణుని కోసం కాపలా కాయసాగారు. చిన్ని కృష్ణుడు ఒక గోపెమ్మ ఇంట్లోకి మధ్యాహ్నం పూట వెళ్ళి, చక్కగా వెన్న ఆరగించి, అప్పుడే అన్నం తిని పడుకున్న అత్తా కోడళ్ళిద్దరి జడలూ కలిపి  ముడి వేసి, పకపకా నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఇంకొక భామ ఇంట్లోకి వెళ్ళి, పాలన్నీ తాగేసి, చక్కగా వెన్న తిని, కాస్త వెన్న తీసి, ఇంటి పనంతా చేసి ఆలిసిపోయి ఒక్క క్షణం నడుం వాల్చిన కోడలి మూతికి వెన్న రాసి, తలుపు చాటున నక్కి చూస్తున్నాడు. అంతలోకే వాళ్ళత్త ఇంటికి వచ్చి, కోడలి మూతికి ఉన్న వెన్న చూసి, కాళీగా ఉన్న వెన్న పెట్టిన దుత్తచూసి, 'ఓసినీ ! వెన్నంతా తిన్నావటే ' ! అంటూ కోడలిని లేపి, నాలుగు ఉతుకుతుంటే పకపకా నవ్వుతూ తలుపు వెనకనుంచి వచ్చి బైటకి పరుగెత్తాడు. అత్తా కోడళ్ళిద్దరూ తెల్లబోయి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.

వంటింట్లో క్రింద ఎక్కడ పెట్టినా  చప్పుడు కాకుండా తినేస్తాడని  ఓ గడుసు భామ
వెన్న కుండను ఉట్టిలో పెట్టి, అది ముట్టుకుంటే
చప్పుడయ్యేలా ఆ ఉట్టికి గంటలు కట్టింది. ఎలా ఐనా కృష్ణుణ్ణి పట్టుకుని వాళ్ళ అమ్మ ముందు దోషిగా నిలబెట్టాలని ఆవిడ ప్రయత్నం. ఎంత సేపు చూసినా కృష్ణుడు రాలేదు. ఆ గొల్లభామకి మాగన్నుగా నిద్ర వచ్చింది. అప్పుడు వచ్చాడు చిన్ని కన్నయ్య. పైన ఉట్టిలో  పెట్టిన వెన్న కుండలను చూశా డు. తనతో వచ్చిన గోప బాలుర సాయంతో పైకెక్కి కుండను తీయడానికి చూస్తూ, ఉట్టికి కట్టిన గంటలను గమనించి శబ్దం చేయవద్దని గంటలకు చెప్పాడు. గంటలు ఆనందిస్తూ 'సరే' అన్నాయి.
కృష్ణుడు కుండని దింపి వెన్నను సావాస గాళ్ళకు అందరికీ పంచి, ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. వెంటనే గంటలు గణగణ మ్రోగాయి. ఆశ్చర్య పోయిన కృష్ణయ్య గంటలని 'నేను మోగద్దన్నానుగా ! అప్పుడు  సరేనని ఇప్పుడు ఇలా మ్రోగారేమిటి?' అని అడిగాడు.
 అప్పుడు గంటలన్నాయిట -  'దేవుడికి నైవేధ్యం పెట్టేటప్పుడు గంటలు మోగడం ఆనవాయితి కదా ! అందుకే అలా మాకు తెలీకుండానే మ్రోగాము, క్షమించు అని !
గంటల శబ్ధానికి ఆ గొల్లభామకి మెళుకువ వచ్చింది.
ఒక్క ఉదుటన లేచి, వెన్న తింటున్న కృష్ణుని చెయ్యి గట్టిగా పట్టుకుంది. దొరికాడు కృష్ణుడని తెగ సంబర పడింది. కోపం నటిస్తూ,
గట్టిగా గద్దిస్తూ 'ఇన్ని రోజుల నుండి నా వెన్నను తింటున్న వాడా ! ఎవరవోయి నీవు ?' అని అడిగింది. కృష్ణుడు 'మా అన్న బల రాముని తమ్ముడిని', అని చెప్పాడు. ఆ మాటలు విని ఎంత గడుసు వాడు ఈ కృష్ణుడు ఎక్కడో ఉన్న, ఇక్కడ లేని బల రాముని పేరు చెప్పాడు, అనుకుంది ఆవిడ. చిలిపి కృష్ణుడు నేను బలరాముడి తమ్ముడిని, అని ఎందుకు చెప్పాడంటే, బలరాముడు చాలా బుద్ధిమంతుడు కదా ! అతని తమ్ముణ్ణి అంటే ఆవిడ వదిలేస్తుందని ! బుధ్ధిమంతుని తమ్ముడు బుధ్ధిమంతు డనుకుంటారని ! ' సరే  ! మా ఇంటికి ఎందుకొచ్చావు?' అనడిగింది ఆవిడ. 'మా ఇల్లనుకుని వచ్చాను' అని చెప్పాడు. 'ఔనా  ! సరే, బాగానే ఉంది. మరి మా ఉట్టిలోని దుత్తలో చెయ్యెందుకు పెట్టావు ?' అని అడిగింది ఆవిడ. దానికి చిలిపి కృష్ణుడు   'మా దూడ ఒకటి తప్పిపోయింది. మీ దుత్తలో దాక్కుందేమో అని వెతుకుతున్నాను' అని కొంటె సమాధానం చెప్పాడట ! 'ఔరా ! ఎంత చమత్కారంగా చెప్పాడు' ! అని  ఆవిడ ఆశ్చర్యపోయి, చిన్ని కృష్ణుని చెయ్యి వదిలి, ఆ ! అని ముక్కున వేలేసుకుందట.  అంతే ! వెంటనే ఒక్క ఉదుటున బైటకి దూకి తుర్రుమని  పరుగెత్తాడట ! అటువంటి బాలకృష్ణుడు మనందరినీ రక్షించు గాక !! 🙏🙏🙏🙏🙏


🙏🙏🙏
ఒకసారి యశోదమ్మ పెరుగు చిలుకుతోంది. బాలకృష్ణుడు పాక్కుంటూ వచ్చి  ' అమ్మా  ! ఆకలేత్తోంది ' అన్నాడు. యశోదమ్మ 'ఇదిగో పెరుగు చిలుకుతున్నానుగా  ! మజ్జిగవగానే ఇస్తాను ' అంది. 'కాదు, నాకు పాలే కావాలి ' అంటూ కవ్వం తన చిన్నారి చేతులతో పట్టుకున్నాడు వాళ్ళమ్మను చిలకనీయకుండా ! పొయ్యి మీద పాలు పెట్టాను కన్నా,  కాగగానే ఇస్తాను అంది యశోదమ్మ. ' వద్దు. నా పాలే నాకు కావాలి ' అంటూ మురిపెంగా అన్నాడట బాలకృష్ణుడు. ' నా తండ్రే  ! ఎంతాకలేస్తోందో నాబిడ్డకి ' అనుకుంటూ యశోదమ్మ కవ్వం వదిలేసి, పిల్లాడిని ఒళ్ళోకి తీసుకుని పాలిస్తోంది. కన్నయ్య హాయిగా ఆనందంగా పాలు తాగుతూ ఉండగా, పొయ్యి మీద పాలు పొందుతున్నాయని, ' ఉండు నాన్నా, పాలగిన్నె పొయ్యి మీంచి దింపొస్తాను ' అంటూ యశోదమ్మ చిన్ని కృష్ణుణ్ణి నేల మీదకు దింపి వంటింట్లో కెళ్ళింది. దాంతో మన చిన్ని కృష్ణుడికి చాలా కోపం వచ్చేసింది. నాకంటే, నా ఆకలి తీర్చటం కంటే నీకు ఆ పాలెక్కువా ? అనుకున్నాడు. ఆ కవ్వం తీసుకుని పెరుగు కుండని ఒక్క దెబ్బ కొట్టాడు. మజ్జిగంతా కారిపోయింది. అసలే రాజీవలోచనుడు  ! అందమైన కాటుక కళ్ళు తుడుచుకుంటూ, బుగ్గలంతా కాటుక చేసుకుంటూ గట్టిగా ఏడవటం మొదలెట్టాడు. వాళ్ళమ్మ వచ్చి చూసేప్పటికి ఇదీ పరిస్థితి  !
సర్వ జగత్తునూ పాలించి పోషించే పరమాత్మ పాలకోసం ఏడవటమనే లీల పరమాద్భుతం  ! పరమాత్మ కే, పరబ్రహ్మకే స్తన్యమిచ్చిన జగన్మాత యశోదాదేవి ధన్యురాలు. 🙏🙏🙏🙏🙏

🙏🙏🙏🙏🙏

ఒకసారి యశోదమ్మ చిన్ని కృష్ణుడికి పాలబువ్వ పెడుతోంది. అప్పుడు వాళ్ళింటికి పళ్ళమ్మటానికి పళ్ళబుట్ట పట్టుకుని ఒక అమ్మి వచ్చింది. యశోదమ్మ తను చెయ్యి కడుక్కుని, బాలునికి  మూతి కడిగి, పళ్ళు కొనటానికి వెళ్ళింది. బాలకృష్ణుడు వాళ్ళమ్మ కొంగు చాటున దాక్కుని తొంగి తొంగి చూస్తున్నాడు. పళ్ళమ్మి చిన్ని కృష్ణునితో  ' పళ్ళు కావాలా !  ఇంద తీసుకో ' అంటూ పళ్ళు ఇవ్వబోయింది. కాలి గజ్జెలు ఘల్లు ఘల్లుమని సవ్వడి చేస్తుండగా, బాలకృష్ణుడు బుడి బుడి అడుగులు వేస్తూ ఇంట్లో లోపలికెళ్ళి దోసిలితో బియ్యం తీసుకుని వస్తుంటే, చేతివేళ్ళ సందుల్లోంచి బియ్యం గింజలు జారిపడిపోతున్నాయి.  పళ్ళమ్మి దగ్గరికొచ్చి అరచేతులకి అంటుకున్న బియ్యం గింజలను ఆమె బుట్టలోకి దులుపుతూ 'ఈ బియ్యం తీసుకుని పళ్ళివ్వు ' అంటున్న బాలకృష్ణుని అందాలు చూస్తూ ఆమె 'ఈ బుట్టలోని పళ్ళన్నీ నీకే  ! తీసుకో ' ! అన్నది. గుప్పెడు అటుకులకే అష్టైశ్వర్యాలను అనుగ్రహించే శ్రీపతికి బుట్టెడు పళ్ళు సమర్పించి ధన్యురాలైంది ఆ పళ్ళమ్మి !!.
🙏🙏🙏 🙏🙏

డా.విశాలాక్షి

Comments