అందరూ సమానమే Dr Visalakshi

🌹🙏
అత్యంత సనాతనమైనది మన సనాతన ధర్మము, హైందవధర్మము. సంఘములో ప్రజలందరూ ఎవరెవరు ఎలా ఉంటే దేశంలోని ప్రజలందరూ సుఖ శాంతులతో మనగలుగుతారో, అలా ఏర్పాటు చేశారు మన మహర్షులు. ప్రతి మనిషి ఎవరికి వారే ప్రత్యేకం, ఎవరికి వారే గొప్ప. కానీ సంఘటితంగా సంఘ క్షేమం, దేశ సౌభాగ్యం ఉండాలి కనుక వర్ణ వ్యవస్థ ని ఏర్పాటు చేశారు. ప్రతి మనిషీ తరించటం కోసం ఆశ్రమ ధర్మాలనేర్పరచారు.

ఋగ్వేదం లో పురుషసూక్తం  లో విరాట్పురుష వర్ణన ఉంది.
'..... బ్రాహ్మణో2స్య ముఖమాసేత్ ! బాహూ రాజన్యః కృతః !
ఊరు తదస్య యద్వైశ్యః !
పద్భ్యాగ్ మ్ శూద్రో అజాయత ...'
సమాజమంతా విరాట్పురుషుడైతే, బ్రాహ్మణులు ఆ పురుషుని ముఖం అయ్యారు. ' బ్రాహ్మణో2స్య ముఖమాసీత్ ' బ్రాహ్మణులు సంఘమనే పురుషునికి ముఖము వంటివారు.
అంటే ముఖంలోనే పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి. మనస్సు బుద్ధి తలలోనే ఉంటాయి. అవి జ్ఞానాన్ని గ్రహిస్తాయి. నియమాలతో వర్తిస్తాయి. శరీరం మొత్తం శక్తిమంతమవటానికి, సంతోషం గా ఉండటానికి కారణమౌతాయి. అలాగే సంఘంలో బ్రాహ్మణులు నియమపాలన చేస్తూ ధార్మిక జీవనాన్ని గడుపుతూ, జ్ఞానాన్నార్జించి, సంఘంలో మిగిలిన మూడు వర్ణాల వారికి ధర్మ బోధ చేస్తూ, జీవిత మార్గాన్ని నిర్దేశిస్తూ, తగిన సలహాలనిస్తూ, సంఘ క్షేమం కోసం లౌకిక సుఖాలను త్యాగం చేస్తాడు.  తాను చేసే జప తప హోమాదుల వల్ల సంపాదించుకున్న ఆధ్యాత్మిక శక్తి ని దేశ రక్షణ కోసం, సర్వ మానవ సంక్షేమం కోసం ధారపోస్తాడు. అది అతని బాధ్యత ! అతని ధర్మం. కనుక మిగిలిన మూడు వర్ణాల వారు బ్రాహ్మణుల సంక్షేమాన్ని కోరాలి, వారియందు కృతజ్ఞతతో ఉండాలి.
బాహూ రాజన్యః కృతః - శరీరానికి భుజశక్తి ఎలాంటిదో క్షత్రియులు సంఘానికి అలాంటివారు ! చేతులతోనే ఏ పనైనా చెయ్యగలుగుతాము. వండి పెట్టగలుగుతాము, దానమివ్వగలుగుతాము, శతృవులతో యుధ్ధం చేసి రక్షించ గలుగుతాము. క్షత్రియుల పని ఇదే  ! తమ భుజబలంతో శౌర్యప్రతాపాలతో రాజ్య ప్రజలందరినీ రక్షించి, దేశాన్ని పాలిస్తూ ఉంటాడు. రక్షించేవారే లేకపోతే, అనుక్షణమూ శతృవుల భయం ఉన్నప్పుడు మిగతా మూడు వర్ణాల వారికీ రక్షణ ఉండదు. కానీ ఎప్పుడైనా   ఏదైనా విపత్కర పరిస్థితులేర్పడితే,  బ్రాహ్మణులు తమ తపోబలంతో రాజును శక్తిమంతుణ్ణి చెయ్యగలుగుతారు.
'ఊరూ తదస్య యద్వైశ్యః'
శరీరానికి తొడలు ఎంత అవసరమో సంఘానికి వైశ్యులు అలాగే ! మనిషికి మూలాధార చక్రం అక్కడే ఉంటుంది. మూలాధార చక్రం లోని శక్తి వల్లే మనిషి స్ధిరంగా మనగలుగుతాడు. అలాగే సంఘంలోని ప్రతి మనిషికీ బ్రతికి ఉండటానికి కావలసిన శక్తి భోజనం వలన వస్తుంది. తిండి బట్ట ఇల్లు సమకూర్చి, మానవులందరికీ భోజనానికి, మాన రక్షణకు, సుఖజీవనానికి కావలసినవన్నీ సమకూరుస్తాడు. వ్యాపారము అతని బాధ్యత.  ఎవరెవరికి ఏయే వస్తువులు ఎంతెంత కావాలో వాటిని వారికి సమకూరుస్తాడు.
' పద్భ్యాగ్ మ్ శూద్రో అజాయత ' పాదముల నుంచి శూద్రులు వచ్చారు. అంటే శూద్రులు ఆ విరాట్పురుషునికి పాదాలు. పాదాలే లేకపోతే, కాళ్ళు లేకపోతే, అసలు కదల లేడు, ఏ పనీ చేసుకోలేడు. సంఘములోని మిగతా మూడు వర్ణాలవారికీ నిత్యజీవితంలో కావలసినవన్నీ సమకూర్చేది నాల్గవ వర్ణం వారే  ! పంటలు పండించి,ఆహారం సమకూరుస్తారు. గృహ నిర్మాణం చేసి, సుఖజీవనానికి, భద్రతకి, స్వేఛ్ఛకి ఏర్పాటు చేస్తారు. వస్త్రాలను తయారు చేసి మానసంరక్షణకి దోహద పడతారు. సమస్త గృహోపకరణాలను సమకూర్చి, శుచి శుభ్రతలకు, ఆరోగ్యప్రదమైన జీవనానికి నాంది పలుకుతారు. వీరు లేకపోతే మిగిలిన మూడు వర్ణాలవారూ నిస్తేజులే  !
శరీరంలోని  ప్రతి అవయవమూ, ప్రతి భాగము ఎంత అవసరమో, సంఘంలోని ప్రతి మనిషీ సంఘానికి,  సమాజానికి, దేశానికి ప్రపంచానికి అంత అవసరము. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు.  అందరూ సమానమే  ! కాని ఎవరి గౌరవ మర్యాదలు వారికివ్వాలి. ఎవరి బాధ్యత వారు సక్రమంగా చెయ్యాలి.
ఒక ఆఫీస్ లో ఆఫీసరు ఉంటాడు, ఉద్యోగస్థులు ఉంటారు. అందరూ కలిసి విధులు నిర్వహించాలి.
🌹💐🌹

Comments