బ్రిటష్ వాడు మన దేశాన్ని ఐఖ్యం చేసాడా? Did British Created United India? By Vaadiyala Ranjith Kumar

బ్రిటష్ వాడు మన దేశాన్ని ఐఖ్యం చేసాడా?

స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చూసిన కొన్ని పోస్ట్లు నాకు చాలా బాధ కలిగించాయి. చాల మంది ఇప్పటికీ బ్రిటిష్ వాడు మనల్నేదో ఉద్దరించేసాడు, దేశాన్ని కలిపాడు అనే బ్రమ లోనే ఉన్నారు. వాళ్ళని తప్పుబట్టలేము. మన చరిత్ర పుస్తకాలు అలా ఉన్నాయి.
ఇలా మన వాళ్ళు అనుకోవడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి. ముఘలుల నుండి మన దేశం బ్రిటిష్ వాడి చేతుల్లోకి వెళ్ళింది అనుకోవడం, బ్రిటీష్ వాళ్ళు మన దేశాన్ని వందల ముక్కలు చెయ్యడానికి చేసిన ప్రయత్నం చాలా మందికి తెలియకపోవడం.

చాలా మంది అనుకుంటున్నట్లుగా ముఘలుల నుండి మన దేశం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళలేదు. శివాజీ మహారాజ్/మరాఠాలూ మోఘలులని దాదాపు తుడిచిపెట్టేసారు. మరాఠాల ధాటికి ముఘలులు కేవలం ఢిల్లీ ఆ పరిసర ప్రాంతాలకి మాత్రమె పరిమితం అయ్యారు. భారతదేశం లో చాలా భాగం మరాఠా పాలనలోకి వచ్చింది. అయితే అది హిందూ విజయం కనుక మన ఎర్ర సోదరులు ఆ విషయాన్ని పాఠ్యపుస్తకాలలో పెట్టలేదు.

ఇప్పుడు రెండో అంశం చూద్దాం. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని కలపలేదు సరి కదా, మన దేశాన్ని కొన్ని వందల ముక్కలు చెయ్యడానికి చెయ్యగలిగిందంతా చేసారు. బ్రిటిష్ వాళ్ళు ఉన్న సమయంలో మన దేశంలో 800 పైగా చిన్న చిన్న రాజ్యాలు వారికి సామంత రాజులుగా ఉండేవారు. వాళ్ళు పేరుకు మాత్రమె రాజులు, అధికారాలన్నీ బ్రిటిష్ వారివే. బ్రిటష్ వాడు వెళ్ళే ముందు భారతదేశంలో విలీనం అవ్వడం, పాకిస్తాన్ తో విలీనం అవ్వడం, స్వతంత్ర రాజ్యంగా ఉండటం అనే మూడు అవకాశాలు ఈ సామంతులకి ఇచ్చాడు. మన దేశం కొన్ని వందల చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది అని వారు దృడంగా నమ్మరు, అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ చేసి వెళ్ళారు. సర్దార్ పటేల్ గారు సామ, దాన, బేధ, దండోపాయాలతో ఈ రాజ్యాలని దేశంలో కలిపేసారు. అంటే బ్రిటిష్ దేశాన్ని ముక్కలు చెయ్యడానికి చివరి వరకూ ప్రయత్నించి విఫలం అయ్యాడు.

బ్రిటిష్ వాళ్ళు రాక ముందు మరి మనం చిన్న చిన్న రాజ్యాలుగానే ఉన్నాం కదా అనవచ్చు. అది నిజమే. భారతదేశం అసలు ఎప్పుడైనా ఒక దేశంగా ఉందా? అశోకుడి కాలంలో కొంత కాలం తప్ప నాకు తెలిసి ఎప్పుడూ లేదు. మరి అలాంటప్పుడు అసలు భారతదేశం అని పేరు ఎలా వచ్చింది? మనం అసలు దేశంలా ఎప్పుడూ లేనప్పుడు భారతదేశం అనే పేరు ఎక్కడ నుండి వచ్చింది? ఏ ప్రాంతాన్ని భారత దేశం అని పిలిచారు? ఎందుకు పిలిచారు? వీటికి సమాధానాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. రాజకీయంగా మనం ఒక పరిపాలన క్రింద ఉన్నది చాలా తక్కువే, అయితే భారతదేశం ఎప్పుడూ సాంస్కృతికంగా ఒక్కటే. అంతర్గతంగా ఎన్ని చిన్న చిన్న రాజ్యాలు ఉన్న, సాంస్కృతికంగా ఇదంతా ఒకటే దేశం అనే భావాన ఎప్పుడూ ఉంది. పురాణాలలో, వేదంలో కూడా హిందూ మహాసముద్రం, హిమాలయాలకి మధ్య ఉన్న భూభాగమే భారతదేశం అని నిర్వచించారు. “ఆసేతు హిమాచలం” అని మనం తరచూ వినే మాటకి ఇదే అర్ధం. ఒకే రాజు పరిపాలన క్రింద ఉంటేనే దేశం అనేది పాశ్చాత్య సిద్ధాంతం. రాజులు, రాజ్యాలు మారవచ్చు సంస్కృతి స్థిరంగా ఉంటుంది. మనది సాంస్కృతిక ఐఖ్యత. దానికి కారణం హిందూ ధర్మం. ఇంత బిన్నత్వం ఉన్నా మనం ఒక దేశంగా, ఇప్పుడు కాదు వందల చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నప్పుడు కూడా, ఉండగలగడానికి ఏకైక కారణం హిందూ ధర్మం. అది అర్ధం కాని వాడికి భారతదేశం గురించి ఏమీ తెలియనట్లే. ఈ కారణం వల్లనే పటేల్ గారైనా మనల్స్ని ఏకం చెయ్యగలిగారు. పాకిస్తాన్ విడిపోవడానికి కారణం అక్కడ హిందూ ధర్మం పోవడం.

ఇవన్నీ సరే మరి రాజకీయ ఐఖ్యతకి ఒక విధంగా కారణం బ్రిటీష్ వారే కదా అనవచ్చు. దానిని పూర్తిగా కాదనలేము. వాళ్ళు ముక్కలు చెయ్యాలి అని అన్ని ప్రయత్నాలూ చేసినా సర్దార్ పటేల్ గారికి అన్నిటినీ ఒక్కటి చెయ్యడానికి ఒక విధంగా అవకాసం కల్పించింది బ్రిటిష్ వారే. అయితే వాళ్ళు రాకపోయి ఉంటె ఇది జరిగేది కాదా? ముమ్మాటికీ జరిగేది, బహుసా చాలా ముందే జరిగేది.

విదేశి దాడులని ఎదుర్కోవాలి అంటే దేశం అంతా ఒకే పరిపాలన క్రిందకి రావాలి అని ప్రతిపాదించి, సాధించిన చాణుక్యుడు. చాణుక్యుడి ఈ వ్యూహం అశోకుడి కాలం వరకూ కొనసాగింది. అశోకుడి సమయంలో దాదాపు ఆఫ్గనిస్తాన్ వరకూ ఆయన పాలనలోకి వచ్చింది. అశోకుడు బౌద్ధ మత అహింసా సిద్ధాంతానికి ప్రభావితం అవ్వడం బహుశా మన దేశానికి జరిగిన అతి పెద్ద నష్టం. కళింగ యుద్ధం వల్ల జరిగిన జన నష్టం బాధాకరమైనదే అయినా, పూర్తి అహింస ఎప్పుడూ ప్రమాధకరమే. దానికి మన దేశమే ఉదాహరణ. వ్యక్తిగత స్థాయిలో అహింసా సిద్ధాంతం ఫలితాలని ఇవ్వవచ్చేమో, ఒక దేశం స్థాయిలో మాత్రం అహింసా సిద్ధాంతం నిస్సందేహంగా తప్పే. అయితే అసలు అహింస అంటే ఏమిటి అనే దాన్ని కూడా మనం అర్ధం చేసుకోవాలి. అహింస అంటే హింస అసలు చెయ్యకపోవడం (Non – Violence) అని చాలా మంది భావన. నేను తప్పు అంటున్నది కూడా దీనినే. అయితే నిజానికి అహింస అంటే అర్ధం అసలు హింసే చెయ్యకపోవడం అని కాదు, వీలైనంత తక్కువ హింస చెయ్యడం అని. రెంటికీ చాలా తేడా ఉంది. అశోకుడు తప్పుడు అహింసా మార్గంలోకి వెళ్ళాడు. దానికి కారణం బౌద్ధం. దాని ప్రభావమే దేశం ఒక చక్రవర్తి పరిపాలనలోకి రాకపోవడం, ఆర్ధికంగా ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉండి కూడా అనాగరిక, ఆటవిక జాతుల చేతుల్లో యుద్ధాలు ఓడిపోవడం. ఫలితం దాదాపు 800 సంవత్సరాలు దేశంలో చాలా భాగం పారాయి పాలనలో ఉండడం. దానినుండి మనం ఇప్పుడిప్పుడే కోలుకున్తున్నాం.

బౌద్ధం ప్రభావం వలన కొంత కాలం పక్కనబడ్డ రాజకీయ ఐఖ్యత బహుశా కొంత కాలం తరువాత మళ్ళీ తేర మీదకి వచ్చి ఉండింది. ఎవరో ఒకరు దానిని సాధించే వారు. కాబట్టి బ్రిటిష్ వాడేదో మన దేశాన్ని కలిపేసి మనల్ని ఉద్దరించాడు అనే బ్రమ నుండి ఇప్పటికైనా మనం బయటకి రావాలి. వారు కలపలేదు సరికదా ముక్కలు ముక్కలు చెయ్యడానికి అన్ని విధాలా ప్రయత్నించారు. వాళ్ళు రాకపోయి ఉండి ఉంటే బహుశా ఈపని ఎప్పుడో జరిగేది.

రచన: వాడియాల రంజిత్ కుమార్

Comments